ప్రజాశక్తి-రాజవొమ్మంగి
మండలంలోని లోదొడ్డి పంచాయతీ పరిధి పాకవెలితి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న జిపిఎస్ పాఠశాలకు కొత్త భవనం నిర్మించాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామ గిరిజనులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల నాయకులు మేలిన రమేష్, జర్తా రాజబాబు మాట్లాడుతూ పాక వెలితి గ్రామంలో ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 3వ తరగతి వరకు సుమారు 20మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. పాఠశాల భవనం శిథిలావస్థలోకి చేరడంతో పెచ్చులూడి విద్యార్థుల మీద పడుతున్నాయని, వర్షం వస్తే పాఠశాల మొత్తం కారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాల మరమ్మతులకు నాడు నేడు కింద రూ.26వేలు నిధులు ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిందని, ఆ డబ్బులు దేనికి సరిపోవని తెలిపారు. తక్షణమే పాఠశాలకు కొత్త భవనం నిర్మించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు పి సత్యనారాయణ, లోతా శ్రీను, ఎం శ్రీను, ఎం రాంబాబు, ఎం వినోద్, గ్రామస్తులు పాల్గొన్నారు.










