
ప్రజాశక్తి-దర్శి: మండలంలోని తూర్పుచౌటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. సోమవారం తూర్పుచౌటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి సమస్యలను తెలుసుకు న్నారు. శామంతపూడి నుంచి తూర్పుచౌటపాలెంకు బస్సు సౌకర్యం కావాలని అడుగగా.. ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌తో వెంటనే మాట్లాడి బస్సు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. పాఠశాలలో గ్రౌండ్ సమస్య ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న జగనన్న విద్యాకానుక అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనం స్వయంగా వడ్డించి విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. విద్యార్ధులు భాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. గ్రామ సచివాలయం సిబ్బంది తమకు సిమెంటు రోడ్డు కావాలని వినతిపత్రం అందజేయగా త్వరలో సిమెంటు రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు కాకర్ల రఘురామయ్య, రమాదేవి, హెడ్‌మాస్టర్ రమణయ్య, సర్పంచ్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ రత్నం, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.