ప్రజాశక్తి రొద్దం : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తనను ఆహ్వానించి అవమానపరిచారని జెడ్పీటీసీ పద్మ అక్కలప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె పాఠశాల ముందు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రొద్దం జెడ్పీహెచ్ స్కూల్‌లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథులుగా తనతోపాటు ఎంపీపీ చంద్రశేఖర్, మేజర్ పంచాయతీ సర్పంచి రూపను ఆహ్వానించారని చెప్పారు. ఈ వేడుకలకు తనను పిలిచి ప్రోటోకాల్ ప్రకారం తనకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకొన్న తహశీల్దార్ అనంతచారి, ఎంపీడీవో రాబర్ట్ విల్సన్, ఎస్‌ఐ నాగస్వామి అక్కడ చేరుకొని జెడ్పీటీసీతో మాట్లాడారు. గత సంవత్సరం వేడుకలకు తనను ఆహ్వానించలేదని, అంతేకాకుండా ఈ సంవత్సరం పిలిసి అవమానపరిచారని జెడ్పీటీసీ విమర్శించారు. ఆమెకు జరిగిన అగౌరవానికి ఉపాధ్యాయులు క్షమాపణ కోరారు. ఈ కార్యక్రమం అక్కులప్ప, సి నారాయణ రెడ్డి, లక్ష్మినారాయణ రెడ్డి, ఈశ్వర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగామండలంలోని చిన్నమంతూరు ఎంపియుపి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తనను ఆవమానించారని దళిత ఎంపిటిసి భర్త వాపోయారు. కార్యక్రమానికి తనను ఆహ్వానించి కనీస సభా మర్యాదలు పాటించలేదని విమర్శించారు. ఈ విషయంపై కెపిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు విరాళం అందజేసిన వ్యక్తిని అవమానించడం సరికాదని అన్నారు.










