Nov 24,2022 23:39

పాఠశాలను పరిశీలిస్తున్న సర్పంచ్‌ త్రినాథ్‌

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధి మాయిస్టు ప్రభావిత ప్రాంతమైన దొరగుడా గ్రామంలో పాఠశాల భవన నిర్మాణం తక్షణమే పూర్తి చేసి, వినియోగం లోకి తీసుకురావాలని సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన దొరగూడ గ్రామంలో సందర్శించి, తాత్కాలికంగా వేసిన రేకుల షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2020 సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఏ నిధులు రూ.45 లక్షలు మంజూరు చేయగా, పాఠశాల భవన నిర్మాణానికి పునాదుల గోతులు తీసి, బేస్మెంట్‌ పనులు నిలిపివేశారన్నారు. పాఠశాలలో పివిటీజీ విద్యార్థులు సుమారు 15 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారని, పాఠశాల భవనం పూర్తిగా నిర్మాణం ఆగి పోవడంతో లక్ష్మీపురం పంచాయతీ స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు తన సొంత నిధులు వెచ్చించి పాఠశాల నిర్వహించేందుకు చిన్న రేకుల షెడ్డును నిర్మించారన్నారు. ప్రస్తుతం తాత్కాలిక రేకు షెడ్డులోనే విద్యా బోధన నిర్వహిస్తున్నారన్నారు.సర్వ శిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో మంజూరైన రూ.45 లక్షల నిధులు ఏమయ్యాయో విద్యాశాఖ, ఐటీడీఏ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.