ప్రజాశక్తి - ఆదోని
ప్రాథమిక విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి చిన్నారికీ విద్యనందించే బాధ్యత పాలకులపై ఉంది. ఆ దిశగా సౌకర్యాలు కల్పించి విద్యాబుద్ధులు నేర్పించాలి. పాలకులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాథమిక విద్యావ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు.
పాఠశాల భవనాలు సరే
పట్టణంలోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీలో నాడు-నేడు కింద సుమారు రూ.కోటి వ్యయంతో భవనాల నిర్మాణం జరుగుతోంది. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు వెచ్చించింది. భవనాల మాట సరే కానీ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు ఏరి అన్న ప్రశ్న తలెత్తుతోంది.
వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకపోవడంతో మెరుగైన విద్యకు దూరమవుతున్నామని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పేద పిల్లల పట్ల చిన్నచూపు సమంజసం కాదంటూ పలువురు నినదిస్తున్నారు.
రోడ్డెక్కిన విద్యార్థులు
పట్టణంలోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీ మున్సిపల్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 6 నుంచి 10వ తరగతి వరకు హైస్కూల్ కొనసాగుతోంది. ఉపాధ్యాయులను నియమించాలని గతవారంలో పాఠశాల ముందు బైఠాయించి విద్యార్థులు ధర్నా చేశారు. 850 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులతోనే విద్యా బోధన చేస్తున్నారు. రెండేళ్లుగా ఇతర పాఠశాలలతో సమానంగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ముగ్గురు సబ్జెక్ట్ టీచర్లతో పాటు ప్రధానోపాధ్యాయులు ఉన్నారని, వారితో మెరుగైన విద్యాబోధన కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మిషన్ల సమయం, నాడు-నేడు పనుల పరిశీలన తదితర పనులకు బోధనేతర సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయుల కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది.
ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి
- లక్ష్మణ్, సిపిఎం పట్టణ కార్యదర్శి
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి. 850 మంది విద్యార్థులకు గాను ముగ్గురు టీచర్లతో బోధన ఎలా ఉంటుందో అధికారులు గ్రహించాలి. నాడు-నేడు కింద భవన నిర్మాణాలను స్వాగతిస్తున్నాం. అదే తరహాలోనే మెరుగైన విద్యనందించేందుకు ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులను నియమించాలి. లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం.
ఉన్నతాధికారులకు నివేదించాం
- ప్రధానోపాధ్యాయులు రమేష్ నాయుడు
స్లమ్ ఏరియాలో హైస్కూల్ ఉండడం వల్ల ఇక్కడ చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉన్న ఉపాధ్యాయులతోనే సర్దుబాటు చేసుకుని మెరుగైన విద్యనందించే దిశగా కృషి చేస్తున్నాం. ప్రస్తుతం గదుల కొరత లేనప్పటికీ విద్యార్థులకు ఎలాంటి సమస్యలూ లేవు. ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉపాధ్యాయులను నియమించాలని ఉన్నతాధికారులను కోరాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
త్వరలోనే సర్దుబాటు చేస్తాం
- ఎంఇఒ శివ రాములు
ఆర్‌ఆర్ లేబర్ కాలనీ హైస్కూల్‌లో విద్యార్థులకు మెరుగైన విద్యనందించే దిశగా దృష్టి సారించాం. అక్కడ ఉపాధ్యాయులను త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే సర్దుబాటు చేసి ఉపాధ్యాయుల కొరతను తీర్చుతాం.










