ప్రజాశక్తి-చెరుకుపల్లి,,(అమర్తలూరు)
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొని సంతోషంగా ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు స్కూల్ బస్సు ఓవర్ టెక్ చేయడంతో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి బోల్తా పడడంతో 20 మంది విద్యార్థులు గాయాల పాలైన సంఘటన మంగళవారం అమర్తలూరు మండల పరిధిలో జరిగింది. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన స్కేర్డ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు మంగళవారం తమ పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మొత్తం 45 మంది విద్యార్థులు తిరిగి ఇళ్లకు బయలుదేరగా కూచిపూడి- పెదపూడి గ్రామాల మధ్య అదే పాఠశాలకు చెందిన మరొక బస్సును ఓవర్ టేక్ చేయబోయిన బస్సు డ్రైవర్ ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో వెంటనే పక్కకు తిప్పడంతో సమీపంలోని పొలాల్లోకి వెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది విద్యార్థులకు గాయాలవగా, వెంటనే తెనాలిలోని హెల్త్ హాస్పిటల్‌కు తరలించి చిన్నారులకు వైద్య పరీక్షలు పాఠశాల యాజమాన్యం నిర్వహించింది. ఒక చిన్నారి తలకు దెబ్బ తగలడంతో స్కానింగ్ తీయించి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
ఆర్డిఓ, అధికారుల పరామర్శ :
స్కూల్ బస్సు బోల్తా పడటంతో వెంటనే స్పందించిన అధికారులు వెంటనే తెనాలి హెల్త్ హాస్పిటల్‌కు చేరుకొని విద్యార్థులకు వైద్య పరీక్షలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. రేపల్లె ఆర్డిఓ జె పార్థసారథి హాస్పిటల్‌కు చేరుకొని ప్రమాద సంఘటన వైద్య సదుపాయాల గురించి విద్యార్థులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సక్రమంగా వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.










