ప్రజాశక్తి-పంగులూరు: పాఠశాల ఆవరణలో దేవాలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయం నిర్మించాలని ఒక వర్గం పట్టుబడుతుండగా పాఠశాల ఆవరణలో ఎలా నిర్మిస్తారని మరో వర్గం ప్రశ్నిస్తోంది. అధికార వైసీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలు, గిరిజనులను రెండు వర్గాలుగా చీల్చి, వారి వారి ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలోనీ ప్రాథమిక పాఠశాల ఆవరణలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలని ఒకవర్గం పట్టుబడుతుంటే, పాఠశాల ఆవరణలో నిర్మిస్తే విద్యార్థుల చదువుకు ఇబ్బంది ఏర్పడుతుందని, మరోచోట నిర్మిస్తే అందరికీ బాగుంటుందని మరోవర్గం చెబుతోంది. దీంతో ఇప్పటివరకు అరమరికలు లేకుండా, ఐక్యంగా జీవిస్తున్న గిరిజనులు రెండు గ్రూపులుగా విడవడిపోతున్నారు. గ్రామంలో ఉన్న గ్రూపు రాజకీయాలకు గిరిజన కాలనీ వేదికగా మారుతోంది. మండలంలోని రామకూరు గ్రామంలోని గిరిజన కాలనీ సుమారు 35 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ 100 కుటుంబాల వారు జీవిస్తున్నారు. వ్యవసాయ పనులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. ఈ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు అక్కడ గిరిజనులకు అవసరార్థం 20 సెంట్ల భూమిని ఉంచారు. అందులో ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకునేందుకు ఆ కాలనీకి పది లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ పది లక్షల రూపాయలతో దేవాలయం నిర్మించేందుకు సమరసత సేవా ఫౌండేషన్ అనే పేరుతో ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం 15 మంది గిరిజనులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆ దేవాలయాన్ని పాఠశాల ఆవరణలోనే నిర్మించాలని వైసీపీలోని ఒక వర్గం అద్దంకి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య చేత జనవరి నెల 26వ తేదీన శంకుస్థాపన చేయించింది. పాఠశాలలో దేవాలయాన్ని నిర్మిస్తే విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని, గుడిని పాఠశాల ఆవరణలో కాకుండా మరో ప్రదేశంలో నిర్మించుకోవాలని గ్రామంలోని వైసిపి మరోవర్గం చెబుతోంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ గ్రూపు చేతిలో ఉండటం వలన, అక్కడ దేవాలయ నిర్మాణానికి తాము అనుమతి ఇవ్వబోమని పట్టుబట్టారు. దీంతో కాలనీలోని గిరిజనులు రెండు గ్రూపులుగా చీలి ఒక గ్రూపు పాఠశాల ఆవరణలోనే దేవాలయాన్ని నిర్మించాలని, మరో గ్రూపు పాఠశాలలో కాకుండా మరో ప్రదేశంలో నిర్మించాలని పట్టుదలతో ఉన్నారు. దేవాలయాన్ని నిర్మించేందుకు కాలనీకి తూర్పువైపున ఉన్న స్థలాన్ని ఇస్తానని మాజీ సర్పంచి మానం సుబ్బారావు చెబుతున్నప్పటికీ వినకుండా పాఠశాల ఆవరణలోనే దేవాలయం నిర్మించాలని శంకుస్థాపన చేయించారు. పాఠశాల ఆవరణలోనే దేవాలయం నిర్మించాలనే వారు అక్కడ నిర్మించుకునేందుకు పంచాయతీ పర్మిషన్ ఇప్పించాలని ఇప్పటికీ తహశీల్దారు కార్యాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే రెండో వర్గం మాత్రం పాఠశాల ఆవరణలో దేవాలయం నిర్మిస్తే విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని, అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, ఉన్నతాధికారులు అందరి చేత అనుమతి పత్రాలు తీసుకొస్తేనే పంచాయతీ పాలకవర్గం పరిశీలిస్తుందని చెబుతున్నారు. ఇందులో రెండు వర్గాలు వారి వారి మాటలు నెగ్గాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై తహశీల్దారు పద్మావతిని, ఎంపీడీవో రమణమూర్తిని, మండల విద్యాశాఖ అధికారి కే నాగభూషణంను 'ప్రజాశక్తి' వివరణ కోరగా పాఠశాల ఆవరణలో దేవాలయాన్ని నిర్మించటం సరైనది కాదని, దీనివల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని, అందువల్ల తాము అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో గిరిజనుల ఓట్లను పొందేందుకే గ్రామంలోని రెండు రాజకీయ పక్షాలు పోటీపడి పనిచేస్తున్నాయని, గిరిజనులపై రెండు వర్గాలకు ప్రేమ లేదని కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే గిరిజనులను రెండు గ్రూపులుగా చీలుస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.










