టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాం. ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నాం, చదువుతున్నాం. ఇక పుస్తకాలంటారా? మనలో చాలామందికి 'ముఖ పుస్తకం'తో ఉన్నంత పని పుస్తకంతో లేకుండా పోయింది. కాబట్టి నేడు మనం పుస్తకాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు ఈ ఇద్దరూ. నాగ్‌పూర్‌కు చెందిన అలిషా నథానీ, లిఖిత్ అగర్వాల్ స్నేహితులు. ఇంజినీరింగ్‌లో కలిసి చదువుకున్నారు. పుస్తకానికి పూర్వ వైభవం కలిగించడానికి 'లైబ్రరీ ఆన్ వీల్స్'' ద్వారా కృషి చేస్తున్నారు. వారి పరిచయమే నేటి స్ఫూర్తి.
ఇంజినీరింగ్ అయిన తర్వాత అలిషా, లిఖిత్ 'పుస్తక పఠనం'పై అధ్యయనం చేశారు. టెక్నాలజీ విస్తరణ వల్ల పుస్తకం పట్ల ప్రజలకు ఆసక్తి తగ్గిపోయిందనే విషయం తెలుసుకున్నారు. అయితే ఈ టెక్నాలజీ యుగంలోనూ పుస్తకాన్ని ప్రేమించేవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని లైబ్రరీలను సందర్శించారు. పుస్తక ప్రియులు ఎక్కువగా ఏయే పుస్తకాలు చదువుతున్నారు? ఒక్కో లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి? తదితర వివరాలు సేకరించి, మరిన్ని పాఠకాదరణ గల పుస్తకాలను ఓచోట పొందుపరిచే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ విధించడంతో ఆ ప్రయత్నం ఆరంభంలోనే ఆగిపోయింది.
లైబ్రరీ ఆన్ వీల్స్
లాక్‌డౌన్ ఎత్తేశారు. ప్రజలు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో కొత్త రకం వైరస్ వార్తలు ప్రచారం కావడంతో లైబ్రరీలకు మందకొడిగా పాఠకులు వెళ్తున్నారు. దీంతో వారానికి ఒక ఏరియాలో మొబైల్ లైబ్రరీని ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అలిషాకు వచ్చింది. వెంటనే విషయాన్ని లిఖిత్‌కు చెప్పింది. 'ఐడియా బాగుంది కానీ వాహనం ఎలా?' అని మొదట్లో అనుకున్నారు. చివరకు లిఖిత్ 'మా నాన్నను అడిగి వాహనం నేను తీసుకొస్తా!' అని హామీ ఇవ్వడంతో తమ పనిని ప్రారంభించారు. దీనికి ''లైబ్రరీ ఆన్ వీల్స్'' అని నామకరణం చేశారు.
'జనాలు బాగా ఎక్కడ ఉంటారు?' అని ఆలోచిస్తే.. బస్టాప్‌ల్లో, కేఫ్‌ల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. బస్టాప్‌లో కొందరు గంటల కొద్దీ కూర్చొని, బాతాఖానీ కొడుతుంటారు. లేదంటే ఫోన్ ముందరేసుకొని ఎవరికోసమో వేచి చూస్తుంటారు. 'ఎంత సమయం వృథా చేసుకుంటున్నారు? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?' అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు అలిషా, లిఖిత్. అందుకే వారానికి ఒక ఏరియా ఎంచుకుని, పాఠకుని దగ్గరకే లైబ్రరీని తీసుకెళ్లాలి అనుకున్నారు. వారు ఏర్పాటు చేసిన ''లైబ్రరీ ఆన్ వీల్స్'' గురించి చెప్పి, పఠనంపై ప్రజల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గంటల కొద్దీ సమయం వృథా చేసుకొనే ప్రాంతాల్లోనే ఈ లైబ్రరీని ఏర్పాటు చేసి, పాఠకులను ఆకర్షిస్తున్నారు.
చిరు ప్రయత్నం
డిసెంబర్ 5, 2020న ఈ లైబ్రరీ ప్రారంభోత్సవం జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వస్తున్నది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అలిషా, లిఖిత్ పనిచేస్తున్నారు. రకరకాల నవలలు, కథా పుస్తకాలతోపాటు హ్యారీ పోటర్ సిరీస్, సిడ్నీ షెల్డన్ పుస్తకాలు, బయోగ్రఫీలు, పొలిటికల్ హిస్టరీలు వంటి పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా ప్రతీవారం కొత్త కొత్త పుస్తకాలు 250కి పైగానే లైబ్రరీలో పెడుతున్నారు. రోజులో చాలా సమయం సెల్‌ఫోన్‌లో గడిపేవారు సైతం తమ పుస్తకాలను తీసుకెళ్లి, చదువుతున్నట్లు వాళ్లు చెబుతున్నారు. పెద్ద మార్పు సాధించే దిశగా ఓ చిరు ప్రయత్నం ఇదనీ, తక్కువ సమయంలోనే తమ ఐడియా సక్సెస్ అయిందనీ వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
'లైబ్రరీ ఆన్ వీల్స్ లాభాపేక్ష కోసం చేస్తున్న పని కాదు. నేటితరంలో పుస్తక పఠనం అలవాటు చేయడం కోసం చేస్తున్న ఒక మంచి కార్యక్రమం. అందుకే ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ఉచితంగానే పుస్తకాలు అందిస్తున్నాము. అయితే పుస్తకం తీసుకొన్నప్పుడు రూ.50 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చదవడం అయిపోయిన తర్వాత పుస్తకం తిరిగి ఇచ్చే సమయంలో డిపాజిట్ తిరిగి తీసుకోవచ్చు' అని అంటున్నారు ఆ ఇద్దరూ. రోడ్డుపై బండి పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'లైబ్రరీని పెట్టేందుకు ఏ వీధికి వెళ్తే ఆ వీధి అధికారులు, పోలీసుల నుంచి అనుమతులు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు అన్ని ప్రధాన నగరాల్లో జరగాల్సి ఉందని, ఈ మేరకు పఠన సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది!' అని అలిషా, లిఖిత్ అంటున్నారు.