పింఛన్ల ఏరివేతకు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు
ప్రతి సచివాలయ పరిధిలో 5 నుంచి 15 పింఛన్లు కోత
వాటి స్థానంలో జనవరిలో కొత్త పింఛన్లు
విద్యుత్ బిల్లుల సాకుతో ఏరివేతకు ప్రణాళిక
రెండు జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారులు 4.83 లక్షల మంది
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
'ఒక ప్రాణం తీశా.. మరో ప్రాణం పోశా.. లెక్క సరిపోయింది' అంటూ ఓ సినిమాలో విలన్ చెప్పిన డైలాగ్ సామాజిక పింఛన్ల మంజూరులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు అతికినట్లు సరిపోతుంది. ప్రతి ఆరు నెలలకోసారి కొత్త పింఛన్ల మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అదే సమయంలో ఆరు నెలలకోసారి విద్యుత్ బిల్లులతోపాటు అనేక సాకులు చూపుతూ ఉన్న పింఛన్లను తొలగించే ప్రక్రియకు సైతం ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం వచ్చే జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో 2.65 లక్షల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 2.18 లక్షల మంది సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. వీటిలో వృద్దాప్య, వితంతు, వికలాంగులు వంటి పలు రకాల పింఛన్లు ఉన్నాయి. అర్హత ఉండి కూడా అనేక మందికి పింఛన్లు అందని పరిస్థితి ఉంది. వీరంతా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారు ఏలూరు జిల్లాలో దాదాపు పది వేల మంది ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఐదువేలకుపైగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం ఉన్న పింఛన్లను తొలగించేందుకు పూనుకుంది. పింఛను అందుకుంటున్న వారి కరెంటు బిల్లులను ఆరు నెలల సరాసరి పరిశీలించి 300 యూనిట్లు దాటితే పింఛన్ నిలిపివేస్తోంది. ఈ కాలంలో ఇంట్లో ఏదైనా వివాహం, వేరే వేడుకలు జరిగి విద్యుత్ బిల్లు పెరిగితే పింఛన్ ఆగిపోయినట్టే. ఇలా పలు నిబంధనలను తెరపైకి తెచ్చి పింఛన్లను ఆపేస్తోంది. పరిశీలన పేరుతో ప్రతి సచివాలయ పరిధిలో ఐదు నుంచి 15 పింఛన్లు వరకూ ఏరివేత జాబితాలో చేరాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 1165 వరకూ గ్రామ, పట్టణ సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయ పరిధిలో పది పింఛన్లు ఏరివేసినా 11 వేలకుపైగా పింఛన్లు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఏరివేత జాబితా సంఖ్య గురించి ఏఒక్క అధికారీ సమాధానం చెప్పని పరిస్థితి నెలకొంది. 20, 30 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లకు విద్యుత్ మీటర్లన్నీ దాదాపుగా ఇంటి పెద్ద పేరుపైనే ఉన్నాయి. కుమారులు ఆ ఇంట్లో ఉంటున్నప్పటికీ పింఛన్ అందుకుంటున్న వ్యక్తి పేరుపైనే విద్యుత్ మీటర్ నడుస్తోంది. కుమారులు విద్యుత్ వాడుకుంటే ఏసంబధం లేని వృద్ధుల పింఛన్ ఆపేస్తున్నారు. ఇలాంటివి అనేక ఇబ్బందులు ఉన్నాయి.
పింఛన్ల మాయ
ప్రతి ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఏరివేసిన పింఛన్ల గురించి మాత్రం చెప్పడం లేదు. కొత్త పింఛన్లు ఎన్ని మంజూరు చేస్తే దాదాపు అదేస్థాయిలో పాత పింఛన్లు తొలగిస్తున్నారు. పింఛన్లు సంఖ్య పెరగకుండా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పింఛన్ల ఏరివేతకు సంబంధించిన వివరాలు డిఆర్‌డిఎ కార్యాలయ సిబ్బంది తమకు తెలియదని చెబుతున్నారు. నేరుగా సచివాలయ సిబ్బంది లాగిన్‌లోకి పంపించి పింఛన్ల ఏరివేత చేపడుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వంటి రాష్ట్రంలో 300 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఇక్కడ మాత్రం మూడొందల యూనిట్లు విద్యుత్ వాడుకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త పింఛన్ల మంజూరులో ప్రభుత్వ కపట నాటకం ఆడుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. జనవరి నుంచి రూ.2500గా ఉన్న పింఛన్ రూ.2,750కు పెరగనుంది. ఈ తరుణంలో పింఛన్ల ఏరివేత ఎంతోమంది లబ్ధిదారులకు తీరని వేదన మిగుల్చుతోంది.










