
ప్రజాశక్తి-కె.కోటపాడు
పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై కథనాలు రాస్తున్నారని ఆ మండల విశాలాంధ్ర విలేకరి పల్లి వెంకటరమణపై వైసీపీ సర్పంచ్ కుమారుడు దాడి చేసిన సంఘటనను మండలంలోని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలియజేసి, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జె.త్రిమూర్తులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యుజె జిల్లా సహాయ కార్యదర్శి కుబిరెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ అక్రమాలపై వార్తలు ప్రచురించే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గజ్జి బాలగంగాధర్, శిలపరశెట్టి వెంకటరావు, శరగడం పరమేశ్వరరావు , కొరుపోలు రామకృష్ణ, యలమంచిలి ధర్మారావు పాల్గొన్నారు.
పెదముషిడివాడ సర్పంచ్ కుమారుడిని అరెస్టు చేయాలి : సిఐటియు
పరవాడ : పరవాడ మండల విశాలాంధ్ర విలేకరి పల్లి వెంకట రమణ అలియాస్ శ్రీనుపై సోమవారం మరణాయుధాలుతో దాడి చేసిన సంఘటనపై విచారణ చేసి, బాధ్యుడైన పెదముషిడివాడ సర్పంచ్ కుమారుడు పల్లా అప్పారావు అలియాస్ కబాడీ అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సర్పంచ్ కుమారుడు చేసిన భూ కుంభకోణాలు, అన్యాయాలు, అక్రమాణాలపై వార్త రాసినందుకు దారి కాసి చంపేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. మండలంలో ఇలాంటి రౌడీ దందాలు ఎప్పుడూ జరగలేదని, సౌమ్యంగా ఉండే పరవాడ ప్రాంతం రౌడీలు, గూండాలు పెరిగారని, ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామికం
దేవరాపల్లి : అక్రమాలుపై వార్తలు ప్రచురించే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని ఎపియుడబ్ల్యుజె చోడవరం ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు కాటపల్లి అప్పారావు అన్నారు. పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలు సమస్యలపై కథనాలు రాస్తున్నారని అక్కడ విశాలాంధ్ర విలేకరి పల్లి వెంకటరమణపై వైసీపీ సర్పంచ్ కుమారుడు దాడి చేసిన సంఘటనను మండలంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.