ప్రజాశక్తి-అనకాపల్లి
పాత్రికేకయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బివి.సత్యవతి అన్నారు. స్థానిక న్యూ కాలనీ రోటరీ కళ్యాణ మండపంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యవతి మాట్లాడుతూ విలేకరులకు ఇళ్ల స్థలాలు, బీమా సదుపాయం, రైల్వే పాసులు, అక్రిడిటేషన్ సమస్యలు, విద్యాలయాల్లో విలేకరుల పిల్లలకు 50 శాతం రాయితీ వంటి సమస్యలను ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, ఎంపిపి గొర్లి సూరిబాబు మాట్లాడుతూ అనకాపల్లి విలేకరులకు ఇళ్ల స్థలాల పంపిణీపై ఇప్పటికే రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ సానుకూలంగా ఉన్నారని, వీలైనంత త్వరలోనే పట్టాల పంపిణీ చేస్తామని చెప్పారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, విశాఖపట్నం అధ్యక్షులు నారాయణ, సీనియర్ నాయకులు జి.కాంతారావు, రవికుమార్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న విలేకరుల కుటుంబాల్లో ఆర్థిక ప్రగతి లేదన్నారు. ఇళ్ల స్థలాల సమస్య దశాబ్దాలుగా పరిష్కారం కాలేదని, వీటి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం విలేకరులకు యూనియన్ గుర్తింపు కార్డులు, వాహనాల స్టిక్కర్లు పంపిణీ చేశారు.
ఎంపీ సత్యవతికి సత్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ సత్యవతిని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాయుడు బాబు, కార్యదర్శి చక్రవర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బి కొండలరావు, రామకృష్ణ, ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.










