ప్రజాశక్తి-తెనాలి : యువకుని దారుణ హత్యకు పాత కక్షలే కారణమని డీఎస్పీ బి.జనార్ధనరావు తెలిపారు. ఈనెల ఒకటిన పాండురంగపేటకు చెందిన మట్టే ప్రశాంత్ (26) చెంచుపేట నవోదయ కళ్యాణ మండపం రోడ్డులో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన వారు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనపై డీఎస్పీ సారధ్యంలో కేసు నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు నిందితులైన పాండురగపేటకు చెందిన వేల్పూరి వెంకటేశ్వరరావు అలియాస్ నంద, గండికోట సాంబశివరావు అలియాస్ సాంబ, రెడ్డి ఆదిలక్ష్మిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం వెల్లడించారు. మృతుని తల్లి మట్టే జయలత పాండురం గపేటలో నివాసం ఉంటారు. అమె ఇంటికి సమీపంలో ఉండే రెడ్డి ఆదిలక్ష్మి, రెడ్డి మహేంద్ర, తాడిశెట్టి వెంకాయమ్మ, గండికోట సాంబశివరావు తదితరులతో గతేడాది గొడవలు జరిగాయి. ఈ నేపధ్యంలో ఆదిలక్ష్మి, మరికొందరు మహిళలు జయలతపై దాడి చేశారు. దీనిపై జయలత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు విచారణలో ఉంది. ఆదిలక్ష్మి, ఇంకా కొంతమంది మహి ళలు ఈ కేసులో వాయిదాలకు తిరుగుతున్నారు. కేసులో రాజీపడాలని జయలతను, ఆమె కుమారుడు ప్రశాంత్‌ను ఆదిలక్ష్మి, వేల్పూరి వెంకటేశ్వరరావు అలియాస్ నంద కోరారు. దీనికి జయలత నిరాకరించగా, ప్రశాంత్ మాత్రం కేసు రాజీ పడాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలన్నాడు. అంత మొత్తం చెల్లించలేమని వారు చెప్పడంతో వారిని ప్రశాంత్ ఎగతాళిగా మాట్లాడాడు. దీంతో అతనిపై అదిలక్ష్మి, నంద, గండికోట సాంబశివరావు కోపం పెంచుకున్నారు. ప్రశాంత్‌ను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటిన ఉదయం ఒంటరిగా వెళుతున్న ప్రశాంత్‌ను గమనించి, ఆదిలక్ష్మి వద్ద దాచి ఉంచిన కత్తులతో బైక్‌పై వేల్పూరి వెంకటేశ్వరరావు, గండికోట సాంబశివరావు వెంబడించారు. చెంచుపేట నవోదయ కళ్యాణ మండపం వద్ద ప్రశాంత్ తనకు తెలిసిన వారితో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న దుండగులు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి అతడిని హతమార్చి పరారయ్యారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తులను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన త్రీటౌన్ సిఐ యు.శ్రీనివాసులు, ఎస్‌ఐ విజరుకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.










