Feb 13,2022 09:53

ఒకటి రెండు కాదు.. 73 ఏళ్ల స్వర రాగ గంగాప్రవాహం ఆమెది. ఆమె గాత్రానికి మురిసిపోని మది లేదు.. ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు లతా మంగేష్కర్‌. ఇలా చెప్పాలంటే.. గానకోకిల లతా మంగేష్కర్‌ గురించి చాలానే ఉంది. ఆమె గొప్ప గాయని. కానీ ఆ గొప్పను ఆమె అస్సలు అంగీకరించరు. చాలా పర్ఫెక్షనిస్ట్‌. ఈ విషయాన్ని మాత్రం వంద శాతం అంగీకరిస్తారు. ఎందుకంటే దేశంలోనే అద్భుతమైన సింగర్‌గా ఆమె గుర్తింపు పొందారంటే పని పట్ల ఆమెకున్న అంకితభావం, పాటపై ఆమెకు ఉన్న అమితమైన ప్రేమ, వృత్తిపట్ల ఉన్న పర్‌ఫెక్షన్‌ కారణమని ఆమె చెబుతుండేవారు. ఒక పాట అనుకున్నట్లు రావాలంటే ఆమె ఎన్నిసార్లైనా సాధన చేసేవారు. అరవైఏళ్ల వయసులోనూ కాజోల్‌, మాధురీ దీక్షిత్‌తో పాటు ఈ తరం కథానాయికల గొంతుకు సూట్‌ అయ్యేలా పాటలు పాడేవారంటేనే ఆమెకు పాటంటే ఎంత ప్రేమో.. పాడడమంటే ఎంత ప్రాణమో అర్థమవుతుంది.

    లతా మంగేష్కర్‌ 1929, సెప్టెంబర్‌ 28న జన్మించారు. ఆమె కుటుంబం పాటల పొదరిల్లు. ఆమె తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ సుప్రసిద్ధ సంగీత కళాకారుడు. ఆయనకు ఐదుగురు పిల్లలు. వారందరిలో లతనే పెద్ద. ఆమె తరువాత ఆశ భోంస్లే, హృదయనాథ్‌, ఉష, మీనా ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు లతా మంగేష్కర్‌. అయితే తండ్రి దీనానాథ్‌ మరణంతో ఇంటి భారం చిన్నారి లతపైనే పడింది. కొన్ని చిత్రాల్లో బాలనటిగా కనిపించిన లత.. ఆ తర్వాత గాయనిగా మారి ప్రతి పాటలోనూ అమృతం కురిపించారు.
   చిన్న వయసులోనే కుటుంబ భారం మీద పడడంతో తన నలుగురు తోబుట్టువులనూ జీవితంలో సెటిల్‌ చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు లతా మంగేష్కర్‌. దీంతో వాళ్ళు సెటిల్‌ అయ్యే వరకూ ఆమె పెళ్లి చేసుకోవడానికి వీలు పడలేదు. వాళ్లంతా సెటిల్‌ అయ్యే సమయానికి పెళ్లి వయసు కూడా దాటిపోయింది. అలా పెళ్లికి దూరంగా ఉండిపోయారు లతా. అయితే ఎప్పుడూ తన పెళ్లి గురించి, పర్సనల్‌ లైఫ్‌ గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడకపోవడం ఆమె గొప్పతనానికి నిదర్శనం.
 

                                                                 తమ్ముడి కోసం..

పాటే ప్రాణంగా...

లతా పెళ్లి చేసుకోకపోడానికి మరో ప్రధానకారణం తమ్ముడు హృదయనాథ్‌ మంగేష్కర్‌. ఇతను పోలియో బాధితుడు. తండ్రిని ఆ తమ్ముడిలోనే చూసుకునేది లతా. తమ్ముడంటే ఆమెకు ప్రాణం. అతణ్ణి చూసుకుంటే చాల్లే అనుకుని ఉండొచ్చు. తాను కుదురుకునేలోపు ఆశా భోంస్లే పెళ్లి చేసుకోవడం ఇలా కుటుంబ బాధ్యతలకు, కెరీర్‌కే పరిమితమయ్యారు.
    క్రీడల్లో క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టపడే లతా.. కొత్త కొత్త మోడల్‌ కార్లపై కూడా మక్కువ చూపేవారట! కాగా ఓ ఇంటర్వ్యూలో 'మీరు వైవాహిక జీవితాన్ని కోల్పోయినట్లు ఎప్పుడూ అనిపించలేదా?' అనే ప్రశ్నకు లతా బదులిస్తూ.. 'లేదు, అంతా దేవుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఏం జరిగినా మన మంచికే. ఏం జరగకపోయినా మరింత మంచి జరిగేందుకే. మీరు నన్ను నాలుగు, ఐదు దశాబ్దాల కిందట ఈ ప్రశ్న అడిగి ఉంటే.. మీకు వేరే సమాధానం వచ్చి ఉండేదేమో! కానీ, ఇప్పుడు నాలో అలాంటి ఆలోచనలేవీ లేవు' అని తెలిపారు.
 

                                                           ఎందరికో చేయూతగా...

లతకు సిగ్గు, భయం రెండూ ఎక్కువే. చదువుకోలేక పోవడమే దీనికి కారణం అని చాలాసార్లు చెప్పేవారు. అందుకే ఎంతో మంది అమ్మాయిలను చెల్లెలు ఉష ఆధ్వర్యంలో చదివిస్తూ విద్యా సేవ చేస్తూ వచ్చారు. లతకు ఇంజక్షన్‌ అంటే భయం. సర్జరీలంటే ఇంకా భయం. అయినా వైద్య రంగానికి ఎంతగానో చేయూతనిచ్చారు.
ఎంత చనువున్నా.. లతాజీ తన ఇంట్లో ఫొటోలు తీయనిచ్చేవారు కాదు. ఎంతో నిరాడంబర జీవితం గడిపారు. కుక్కలంటే ఉన్న ఇష్టంతో మామూలుగా ఉండే పాత ఫ్లాట్‌లో వాటిని పెంచేవారు. ఎవరైనా కుక్కల గురించి ప్రస్తావిస్తే.. 'మనుషులను నమ్మలేం. కుక్కలు చాలా నయం.. బాగా ప్రేమిస్తాయి' అనేవారు.
ఇంట్లో అందరూ ఆమెను 'హేమ దీదీ' అనే పిలిచేవారు. ఆమె అసలు పేరు హేమ. తన 13వ ఏటనే తండ్రి మంగేష్కర్‌ చనిపోయారు. మంగేష్కర్‌ స్నేహితుడి సహకారంతో లతగా సినీ సంగీతంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రికలో పనిచేసిన ఓ పాత్రికేయుడు మహ్మద్‌ రఫీ ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు.
 

                                                           ఎంత ఎదిగినా..

ప్రపంచమంతా పడి చచ్చే తన గాత్రం నిజానికి అంత గొప్పదేమీ కాదని వినమ్రంగా చెప్పేవారు లతా మంగేష్కర్‌. 'నేనో మంచి గాయనిని. అంతే. నాలో అసాధారణ ప్రతిభా పాటవాలేమీ లేవు. నాకంటే గొప్పగా పాడే చాలామంది కన్నా పేరు ప్రఖ్యాతులు దైవదత్తంగా నాకొచ్చాయంతే. అందుకే విజయాన్ని ఎప్పడూ నెత్తికెక్కించుకోకూడదు' అని చెప్పేవారామె. 'చిన్నప్పుడు సంగీత శిక్షణను తప్పించుకునేందుకు తలనొప్పి, కడుపునొప్పి అంటూ నాన్నకు చాలా సాకులు చెప్పేదాన్ని. సాధన చేయిస్తుంటే పారిపోయేదాన్ని. నాన్న వెంటపడి పట్టుకుంటే నీ ముందు పాడటానికి సిగ్గేస్తోందంటూ పెనుగులాడేదాన్ని. దాంతో ''నేను నాన్నను మాత్రమే కాను, నీ గురువును కూడా. ఎప్పటికైనా గురువును మించాలని తపించాలి. అంతే తప్ప పాడటానికి సిగ్గేస్తోందని అనకూడదు'' అని ఓ రోజు అనునయించారు. ఆ మాటలను ఎప్పుడూ మరవలేదు' అని ఆమె చెప్పేవారు.
 

                                                 కొన్ని ఆసక్తిరమైన విషయాలు...

  • దీనానాథ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌, శాస్త్రీయ గాయకుడు. అందుకే లత చిన్నప్పటి నుండే సంగీతానికి అలవాటుపడింది. తన ఐదేళ్ల వయసులో ఆమె తన తండ్రి నాటకంలోనూ పాత్ర పోషించింది.
  • తన తండ్రి మరణానంతరం, లత కుటుంబానికి ఏకైక ఆధారం అయింది. ఆమె పాడిన మొదటి పాట మరాఠీ చిత్రం 'కితి హసల్‌'. ఈ సినిమా కొన్ని సమస్యల కారణంగా విడుదల కాలేదు.
  • లతా తన జీవితంలో మొదటి 16 ఏళ్లూ ఆమె జన్మించిన ఇండోర్‌లోనే నివసించారు. ఆమె పుట్టిన ఇల్లు ఇప్పుడు ఒక బట్టల షోరూమ్‌.
  •  లత 1942-1948 సంవత్సరాల మధ్య ఎనిమిది చిత్రాల్లో నటించారు. ఆమె 'ఆనందఘన్‌' అనే మారు పేరుతో కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించారు.
  •  లతా మంగేష్కర్‌ సంగీత దర్శకుడు గులాం హైదర్‌ని తన గాడ్‌ఫాదర్‌గా అభివర్ణించారు.
  •  ఆమెకు ఇష్టమైన క్రీడ క్రికెట్‌ను ఆస్వాదించడానికి లార్డ్స్‌ స్టేడియంలో లతాకు శాశ్వత గ్యాలరీ ఉంది.
  •  1963 జనవరి 27న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా దేశభక్తి గీతం 'ఏ మేరే వతన్‌ కే లోగోన్‌' పాటను ప్రదర్శించినప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కంటతడి పెట్టారు.
  •  1970ల నుంచి లతా మంగేష్కర్‌ సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను స్వచ్చంద సంస్థల కోసం ఉచితంగా చేశారు కూడా.
  •  1974లో లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయ కళాకారిణి లత.

                                                    నేపథ్య గాయకురాలిగా...

లతా నేపథ్య గాయకురాలిగా కొనసాగుతున్న కాలంలో ఖుర్షీద్‌, నూర్జహాన్‌ గాయనిలుగా వెలుగొందుతున్నారు. దేశ విభజన సమయంలో వీరు పాకిస్థాన్‌ వెళ్లడం.. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడం లతా మంగేష్కర్‌కు కలిసొచ్చింది. తర్వాత మంచి నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. సినీ ప్రయాణం ప్రారంభంలోనే లతా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ మరాఠీÄ చిత్రం కోసం ఆమె పాడిన తొలి పాటను తొలగించారు. ఆ తర్వాత 'మజ్‌బూర్‌'లోని 'దిల్‌ మేరా తోడా' పాట పాడారు. ఇది విన్న వారంతా ఆమెను విమర్శించారు. దీనిని సవాలుగా తీసుకున్న ఆమె ఉర్దూలో సంగీత శిక్షణ తీసుకున్నారు. అనంతరం 'మహల్‌' సినిమాలోని 'ఆయేగా ఆయేగా' పాటతో లతాజీ దశ తిరిగింది. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.
 

                                                    ఐదేళ్లకే సంగీత సాధన..

అందాజ్‌, బడీ బహన్‌, బర్సాత్‌, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లో లత పాడిన పాటలు ఆమెకు ఒక స్టార్‌ సింగర్‌ హోదాను కట్టబెట్టాయి. సినిమా రంగంలో మరిన్ని అవకాశాల కోసం తన కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చిన లత, అమంత్‌ ఖాన్‌ దేవస్వలే, పండిట్‌ తులసీదాస్‌ శర్మ లాంటి గురువుల వద్ద ఎప్పటికప్పుడు సంగీత మెళకువలను నేర్చుకుంటూ.. తన ప్రతిభకు సాన పెట్టుకొనేవారు. 1950వ దశకంలో లత వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు.
    శంకర్‌ జైకిషన్‌, నౌషాద్‌ అలీ, ఎస్‌.డి.బర్మన్‌, పండిట్‌ అమర్‌నాథ్‌, హుసన్‌లాల్‌ భగత్‌రాం, సి.రామచంద్ర, హేమంత్‌ కుమార్‌, సలీల్‌ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్‌ హుస్సేన్‌, రోషన్‌, కళ్యాణ్‌ జీ-ఆనంద్‌ జీ, వసంత్‌ దేశారు, సుధీర్‌ ఫడ్కే, హన్స్‌ రాజ్‌ భేల్‌, మదన్‌ మోహన్‌, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె. మొఘల్‌-ఎ-అజమ్‌ (1960) సినిమాలో నౌషాద్‌ సంగీత దర్శకత్వంలో లతా పాడిన 'ప్యార్‌ కియా తో డర్నా క్యా' పాట జనాలను సమ్మోహితుల్ని చేసింది.
భారతీయ సినిమా పాట అంటేనే లత.. ఎందరెందరో వస్తుంటారు, పోతుంటారు.. కానీ లత గానం అజరామరం.. సినిమా పాటల ప్రపంచాన్ని మహారాణిలా ఏలిందామె.. ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. ఓ అమృతగళం వెళ్లిపోయింది. 90 ఏళ్ల వయస్సులోనూ జవాన్ల కోసం వీసమెత్తు వృద్ధఛాయలు లేకుండా, అదే మాధుర్యంతో చివరిగా పాటపాడిన ఆ గొంతు ఇప్పుడు సంగీతప్రియుల్ని విషాదంలో ముంచెత్తుతూ అభిమానులను వీడిపోయారు.

                                                    ఏ రాగమైనా అవలీలగా...

లతాజీ నోట వినిపించని అందమైన రాగం లేదు. ఆమె పాటతో పరవశించని భారతీయ గీతాభిమాని లేడు. భజనలైనా, భక్తి సంకీర్తనలైనా, దేశభక్తి గీతమైనా, ప్రేమ గానమైనా, విషాద రాగమైనా, వియోగ భరిత ఆలాపనైనా.. లతాజీ పాడిందే పాట. ఆమె నోట వినిపించిందే పాట. అందుకే ఆమె ఇంటి ముంగిట వద్దకే అనేక అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి.
 

                                                    అత్యుత్తమ పురస్కారాలు..

భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్‌. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం. ఈమె 1948 నుండి 1978 వరకు 30 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా లత గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు.అలాగే 'గానకోకిల' అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన పాటలు పాడారు. టైం మేగజైన్‌ కవర్‌ పేజీ స్టోరీగా లతామంగేష్కర్‌ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను ''భారతీయ నేపథ్యగాయకుల రాణి'' గా పేర్కొనడం విశేషం. 1969లో పద్మభూషణ్‌, 1999లో పద్మవిభూషణ్‌, 2001లో భారతరత్న పురాస్కారాలతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఎన్‌టీఆర్‌, ఏఎన్నార్‌, మహారాష్ట్ర భూషణ్‌ అవార్డులను దక్కించుకున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్రం సన్మానించింది.

పాటే ప్రాణంగా...


                                                          తెలుగులో ఎవర్‌గ్రీన్‌...

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి 1955లో నటించిన 'సంతానం' చిత్రంలో ఆమె తొలిసారి తెలుగు పాటను పాడారు. 'నిదురపోరా తమ్ముడా' అంటూ సాగే పాటకు సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. తర్వాత 1965లో ఎన్టీఆర్‌, జమున నటించిన 'దొరికితే దొంగలు' చిత్రంలో 'శ్రీ వెంకటేశా' పాటను పాడారు. సాలూరి రాజేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇక 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన 'ఆఖరి పోరాటం' సినిమాలోని 'తెల్లచీరకు' పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి లతాజీ పాడారు. ఈ పాట ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌.