ప్రజాశక్తి- పలాస: రైల్వేశాఖలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ అధ్యక్షులు, ఎం.ఉమామహేశ్వరరావు, జాయింట్ జనరల్ సెక్రటరీ మట్ట రామకృష్ణ డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా పలాసలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఇబ్బంది కలిగించే విధంగా రైల్వేలో కొత్త నిబంధనలు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పెన్షన్ పూర్తిగా ఉండదని అన్నారు. కేవలం జీతభత్యాలపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ తరువాత అనేక రాయతీలతో పాటు పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగి కళని, దీన్ని కాలరాసే విధంగా ఈ రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడం తగదని అన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని 2022, నవంబరు 28 నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. వివిధ దేశాల్లో పోరాటాలు చేసిన తరువాత చలో ఢిల్లీకి పిలుపునిచ్చామని అన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ మేనేజర్‌కు ఆంధ్రా యూనియన్ పోరాటాల పోస్టర్లను అందించారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, బి.గాంధీ, ఎం.డి.వి రమణ, హెచ్.ఎస్ దామోదర్, విజయకుమార్, కె.కృష్ణ పాల్గొన్నారు.










