Apr 17,2023 01:42
మాట్లాడుతున్న నరసింగరావు

ప్రజాశక్తి-బాపట్ల: విద్యుత్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం విధానాన్ని అమలు చేయాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు అన్నారు. ఆదివారం యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం బాపట్ల ఎమ్మెస్సార్‌ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ కాంట్రాక్టు రెగ్యులర్‌ చేయాలన్నారు. విద్యుత్‌ సంస్థలను పరిరక్షించుకునే దిశగా యూనియన్‌ గురుతర బాధ్యత వహించాలన్నారు. పిఆర్‌సి కాంట్రాక్ట్‌ కార్మికులకు గ్రేడులు వర్తింపచేయాలన్నారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పని నిబంధనలు పాటించకపోవడం వల్ల ఓఅండ్‌ఎం అకౌంట్స్‌ సిబ్బంది ఒత్తిడికిలోనై ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ప్రమాదానికి గురై, అనారోగ్యం పాలైన లైన్‌మేన్‌లను విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో విధులకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులను కాంట్రాక్టర్లకు కట్టపెట్టాలని విద్యుత్‌ సంస్థలు యోచించడం అన్యాయమన్నారు. విద్యుత్‌ శాఖలో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు మాట్లాడుతూ విద్యుత్‌ సంస్థలో ఎన్నికలు నిర్వహించి ఆయా కార్మిక సంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. గ్రేడ్‌-2 జూనియర్‌ లైన్‌ మెన్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేసే కార్మికులకు మెడికల్‌ కార్డులు అందజేయాలన్నారు. అదేవిధంగా ప్రతి నెల ఒకటిన జీతాలు, పెన్షన్‌ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు పిఆర్‌సి వర్తింపజేసి యాజమాన్యంతో పిఆర్‌సిపై చర్చల్లో ప్రతిసంఘం నాయకులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ శాఖలో కార్మికుల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.