Aug 07,2023 00:22

పాదయాత్ర చేస్తున్న రక్షణ రంగ కార్మికులు

ప్రజాశక్తి -మూలగాడ : 'కొత్త టె(పె)న్షన్‌ వద్దు-పాత పెన్షన్‌ ముద్దు' అనే నినాదంతో డిఫెన్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యాన రక్షణ రంగ కార్మికులు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. శ్రీహరిపురంలోని కోరమాండల్‌ గేటు నుంచి నేవల్‌ బేస్‌ వరకూ చేపట్టిన పాదయాత్ర కార్మిక శక్తికి, ఉద్యమస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఉమ్మడి విశాఖ జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు యువిఎస్‌ఎన్‌.వర్మ ఎర్రజెండా ఊపి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఎన్‌సిఇ, ఎన్‌ఎడిసిఇ, ఎస్‌బిసిసిఇ, ఎంఇఎస్‌సిఇ, ఎన్‌ఎస్‌టిఎల్‌సిఇ, డిజిఎన్‌పిసిఇ తదితర యూనియన్లు పాదయాత్రకు భాగస్వామ్యం వహించాయి.
డిఫెన్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ రెడ్డి వెంకటరావు పాదయాత్ర అనంతరం నేవల్‌ బేస్‌ వద్ద జరిగిన ముగింపు సభలో మాట్లాడారు. పెన్షన్‌ బిక్ష కాదు ఉద్యోగుల హక్కు అని, దానిని సాధించేంతవరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఆర్‌ఎపై ఒటి, అప్రెంటిస్‌లకు ఇంక్రిమెంట్లు విషయంలో తూర్పున కార్మికులు వివక్ష గురవుతున్నారని వివరించారు. ఆరేడు సంవత్సరాలైనా జీతాలకు సంబంధించిన ఎరియర్స్‌ రాలేదని, ఎప్పుడు వైద్య సౌకర్యాలు ఆగిపోతాయో తెలియని పరిస్థితి ఉందని, వీటిని వెంటనే పరిష్కరించాలని తూర్పు నౌకాదళ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే బేస్‌ గెట్‌ దగ్గరే రక్షణ రంగ కార్మిక కుటుంబాలతో వంటావార్పు చేపడతామని హెచ్చరించారు.
పాదయాత్రకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోని పంచభూతాలను బిజెపి ప్రభుత్వం ఒడిసి పట్టిందని, మోడీ మిత్రులైన అంబానీకి దేశ పశ్చిమతీరాన్ని, అదానీలకు తూర్పు తీరాన్ని దారాదత్తం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అమ్మడమే బిజెపి దేశభక్తి అని ఎద్దేవాచేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. సభలో ఏఐడీఈఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.గోపాలకృష్ణ, టీఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నాగార్జునరావు, డీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చింతా చిట్టిరాజు, ఐఎన్‌టీయూసీ విశాఖ జిల్లా కార్యదర్శి టి.సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. ఎన్‌సీఈయూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి.నాగేశ్వరరావు, ఎన్‌ఏడీసీఈ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస రావు, ఎస్‌బిసిసిఇ యూనియన్‌ అధ్యక్షులు వర్మ, ప్రధాన కార్యదర్శి రతన్‌రాజు, ఎంఇఎస్‌సి యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డీన్‌ అహ్మద్‌, ఎన్సీ యూనియన్‌ అధ్యక్షులు మారుతి వరప్రసాద్‌, ఎన్‌ఎడిసిఇ యూనియన్‌ అధ్యక్షులు నూకరాజు, ఐఎన్‌సి కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కాకర వివిఎస్‌డి.కుమార్‌, అంజనీ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.