Oct 19,2023 22:14


ప్రజాశక్తి-కాకినాడ సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని, డిఎస్‌సి-2003 వారికి తక్షణమే పాత పెన్షన్‌ వర్తింజేయాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన గురువారం దీక్షలు చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కెవివి.నాగేశ్వరరావు అధ్యక్షతన చేపట్టిన ఈ దీక్షల్లో రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాము మాట్లాడుతూ సిఎం వైఎస్‌.జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపియస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తారనని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్‌పై టెక్నికల్‌ నాలెడ్జ్‌ లేదని తప్పించుకుని జిపిఎస్‌ అనే కొత్త నాటకానికి తెరలేపడం ఉద్యోగులను మోసగించడమేనన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న జిపిఎస్‌ను ఏ మాత్రం వొప్పుకునేది లేదని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రవి చక్రవర్తి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన మెమో 57 ప్రకారం దేశంలో ఇప్పటికే 5 రాష్ట్రాలు పాత పెన్షన్‌ అమలు చేస్తున్నాయన్నారు. కేంద్రం ఇస్తున్న అన్ని జిఒలూ అమలు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం మెమో 57 కూడా అమలు చేసి మొదటిగా నష్టపోయిన డిఎస్‌సి- 2003 వారికి న్యాయం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు కెవివి. నాగేశ్వరరావు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2050 నాటికి పెన్షన్‌లు ప్రభుత్వానికి చాలా భారం అవుతాయని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఈ భారం ఏ విధంగా అవుతుందో ప్రభుత్వం జీతాలు, పెన్షన్‌లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షల్లో టివిజిఆర్‌.చక్రవర్తి, పిజి.గోపాలరావు, వివి.రమణ, ఎంవి.సాయిరామ్‌, పి.చంద్ర శేఖరరావు, సిహెచ్‌.సూరిబాబు, డి.కనకదుర్గా దేవి, ఆర్‌.సత్య ప్రసాద్‌, ఎ.సీతారామరాజు పాల్గొన్నారు. వీరికి ఐ.ప్రసాదరావు, బి.నాగమణి, వి.సోనీ, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణీ తదితరులు సంఘీభావం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ సిపిఎస్‌ రద్దుచేసి నిరాహార దీక్షలకు ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు తెలిపారు.