ప్రజాశక్తి-విజయవాడ
న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్దరించాలని కోరుతూ ఎఐఆర్‌ఎఫ్-ఎస్‌సిఆర్‌ఎంయు ఆధ్వర్యంలో స్థానిక రైల్వే కార్మికులు మంగళవారం స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు వివిఎల్ నరసింహులు సంపూర్ణ సంఘీభావం తెలిపి మాట్లాడారు. న్యూపెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్దరించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, దీనికి సిఐటియు అండగా నిలుస్తుందని అన్నారు. పెన్షన్ అనేది బిక్ష కాదని, అది ఒక హక్కు అని, ఎన్నో పోరాటాల ద్వారా పెన్షన్‌ను కార్మికవర్గం సాధించుకుందని అన్నారు. అయితే ఈ నూతన పెన్షన్ విధానం వల్ల 2004 ఏప్రిల్ నుంచి ఉద్యోగాల్లో చేరిన వారికి నూతన పెన్షన్ స్వీమ్ ద్వారా పెన్షన్ పొందే హక్కు లేదని అన్నారు. పాతపెన్షన్ విధానం కోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు. ఎస్‌సిఆర్‌ఎంయు డివిజనల్ ట్రెజరర్ శ్రీరామ్ గుప్తా మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి-మోడీ నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. కోట్లాది మంది ఉద్యోగుల, కార్మికుల శ్రమ ద్వారా సృష్టిస్తున్న సంపదను కార్పొరేట్ శక్తులకు అంబాని, ఆదాని వంటి వారికి వనరులన్నింటినీ ప్రయివేటీకరించి, కారు చౌకగా అమ్మేస్తుందని దుయ్యబట్టారు. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నింటినీ హరిస్తుందని అన్నారు. అందులో భాగమే ఈ నూతన పెన్షన్ విధానమని అన్నారు. పాత పెన్షన్ పునరుద్దరణకు , రైల్వే ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా అన్ని ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాలతో ఐక్య ఉద్యమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐఆర్‌ఎఫ్-ఎస్‌సిఆర్‌ఎంయు డివిజన్ సహాయ కార్యదర్శి డిఎస్ వర్మ,డివిజన్ ఉపాధ్యక్షురాలు ఎం లీల, దక్షిణ మధ్య రైల్వే జోన్ అధ్యక్షురాలు మారుతీ లక్ష్మీ, స్టేషన్ బ్రాంచ్ కార్యదర్శి షరీఫ్, రన్నింగ్ బ్రాంచ్ కోటేశ్వరరావు, క్రాంతి కుమార్ , అసిస్టెంట్ కార్యదర్శి వాసు, ఆపరేటింగ్ బ్రాంచ్ ఎస్‌ఆర్‌కె ప్రసాద్, మోహన్‌రావు (డిఆర్‌ఎం బ్రాంచ్) తదితరులు పాల్గొన్నారు.










