కడప అర్బన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారో ! గద్దె దిగుతారో ! రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సిపిఎస్, జిపిఎస్, విధానాలను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు యుటిఎఫ్ భవన్‌లో గురువారం ఆమరణ నిరాహార దీక్షలను ప్రారంభించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు, సహాధ్యక్షుడు వై.రవికుమార్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ సి.సుదర్శన్ దీక్షలో కూర్చున్నారు. దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.ఓబుల్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్.నాగార్జున రెడ్డి, సిఐటియు పట్టణ కార్యదర్శి పి.సుబ్బయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు శుస్క వాగ్దానాలతో, ఉద్యోగుల అండద ండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్, గద్దెనెక్కగానే ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరించడం దుర్మార్గమన్నారు. తాను అధికారంలోకి వస్తే వారంలోపే రద్దు చేస్తామన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోగా మరో మోసపూరితమైన జిపిఎస్ విధానాన్ని అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి సర్కార్ కే చెల్లిందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమేనా మీ ప్రభుత్వ విశ్వసనీయత అని ముఖ్యమంత్రిని నిలదీశారు. సిపిఎస్ రద్దుపట్ల హామీ ఇవ్వని అనేక రాష్ట్రాలు సిపిఎస్ ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట తప్పడం, మడమ తిప్పడం ఏంటని వారు నిలదీశారు. పాత పెన్షన్ అమలు కోసం మొక్కవోని దీక్షతో పోరు సలుపుతున్న యుటిఎఫ్ ఉద్యమాలకు బాసటగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపా ధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని, అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిజమని నమ్మి ఉద్యోగ, ఉపాధ్యాయులు నిలువునా దగాపడ్డారని ఆరోపి ంచారు. ఉద్యోగులను అన్ని రకాలుగా వంచించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చత్తీష్‌ఘడ్, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్ ఇదితర రాష్ట్రాలలో పాత పెన్షన్ విధా నాన్ని అమలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ అమలు ఆర్థిక భారమంటూ తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనలో వాస్తవం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే తమ డిమాండ్ ను రాజకీయ డిమాండ్ గా, అజెం డాగా మారుస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో పాత పెన్షన్ ఇచ్చే పార్టీకే ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలుంటాయని వారు పేర్కొన్నారు. ఓట్ ఫర్ ఓపిఎస్ అనే నినాదంతో ముందుకు సాగుతామని వారు తెలిపారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి చేపట్టిన దీక్షల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుండా, మొండిగా వ్యవహరిస్తే తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ దీక్షలకు మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారితో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులను కూడా మోసం చేయడంలో ఈ ప్రభుత్వం సఫలీకతమైందన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే బిక్ష కాదని, అది ఉద్యోగి హక్కు అని ఆయన పేర్కొన్నారు. పాత పెన్షన్ సాధన కోసం ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల కోసం యుటిఎఫ్ చేసే పోరాటంలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్.అబ్దుల్లా, ఎస్.సి, ఎస్.టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున, జిల్లా అధ్యక్షులు గంగరాజు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు కె.రమేష్ యాదవ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు, నాయకులు షాకీర్ లు మద్దతుగా పాల్గొని ప్రసంగించారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, కె.చెన్నయ్య, ఎస్.ఎజాస్ అహ్మద్, డి.కష్ణారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్, సిపిఎస్ జిల్లా కో-కన్వీనర్ అయ్యవారు రెడ్డి, అంథ ఉపాధ్యాయులు పార్థసారథి, నాగ సుబ్బయ్య, మహిళా నాయకులు రాజ్యలక్ష్మి, శశిరేఖ, మేరీ జయశీల, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










