Oct 20,2023 00:04

నిరవధిక దీక్షలో కూర్చున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద యుటిఎఫ్‌ విశాఖ జిల్లా సహాధ్యక్షులు రొంగలి ఉమాదేవి అధ్యక్షతన గురువారం నిరాహార దీక్షలు చేపట్టారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకత్వం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు కొనసాగింపుగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యుటిఎఫ్‌ నాయకులు గొంది చిన్నబ్బాయి, టిఆర్‌.అంబేద్కర్‌, తాడాన అప్పారావు, చుక్క సత్యం, ఉప్పాడ రాము, ఎస్‌.నూకరాజు, రిజ్వన్‌, గేదెల శాంతిదేవి దీక్షల్లో కూర్చున్నారు. సీనియర్‌ నాయకులు సామారాజులు, ఎస్‌ఎస్‌.నాగమణి, ఎన్‌.ప్రభాకర్‌, ఉషారాణి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్‌.అంబేద్కర్‌ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్‌ను రద్దు చేసి, ఒపిఎస్‌ అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులు ఉపాధ్యాయులకు మరణ శాసనమైన జిపిఎస్‌ను అమలులోకి తీసుకురావడం మోస పూరిత చర్య అని పేర్కొన్నారు. తక్షణమే జిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ పునరుద్దరణకు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ, సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను మాత్రమే అమలు చేస్తామని రాజకీయ మేనిఫెస్టోలో పెట్టే పార్టీలకు మాత్రమే రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఓట్లు వేయనున్నట్లు స్పష్టంచేశారు. ఒపిఎస్‌ సాధనకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ పూర్వ ప్రధాన కార్యదర్శి వైఆర్‌కె.ప్రసాద్‌, ఉమ్మడి జిల్లా నాయకులు జిఎస్‌.ప్రకాష్‌, ఎస్‌.నూకరాజు, యల్లయ్య బాబు, రియాజ్‌ అహ్మద్‌, టి.జగన్‌, చంద్రరావు, ఎం.రామకృష్ణ, సంతోష్‌, ఉమాబాల, ప్రేమకుమారి, వివిధ మండలాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.