Jul 17,2023 01:58
రౌడీ షీటర్స్‌, పాత నేరస్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రౌడీ షీటర్లు, పాత నేరస్తులు చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే జిల్లా బహిష్కరణ శిక్ష విధించడానికి కూడా వెనుకాడబోమని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. ఆదివారం ఎస్‌పి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌ అధికారులు వారి స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గతంలో క్షణికావేశంలో లేదా స్వలాభం కోసమో నేరాలకు పాల్పడినవారు, చేసిన తప్పులను తెలుసుకొని తిరిగి అటువంటి నేరాలు పునరావృతం కాకుం డా సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ సూచించారు. పోలీస్‌ అధికారుల సూచనలు పెడచెవిన పెట్టి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే వారిపై పీడీ చట్టం అమలుపరిచి జిల్లా బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ అధికారులు వారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం వుండే పాతనేరస్తులు, రౌడీ షీటర్స్‌పై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. వారు సమాజంలో గౌరవంగా జీవించే విధంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పోలీస్‌ అధికారులను ఎస్‌పి ఆదేశించారు.