Feb 24,2023 23:59

డివైడర్లను తొలగించి రోడ్డు వెడల్పు పనులు

ట్రాఫిక్‌ నియంత్రణకు తాత్కాలిక చర్యలు
డివైడర్ల తొలగింపుతో రోడ్డు వెడల్పు పనులు
వాహనాలను నేరుగా మళ్లింపునకు ఏర్పాట్లు
ప్రజాశక్తి -గాజువాక
: రేయింబవళ్లు తేడా లేకుండా, నిత్యం విపరీతమైన రద్దీతో ఉండే పాతగాజువాక జంక్షన్‌లో ట్రాఫిక్‌ నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పాతగాజువాక జంక్షన్‌లో ఉన్న డివైడర్లను తొలగించి, ఒకేసారి మూడు పెద్ద వాహనాలు పోయేంత వీలుగా జంక్షన్‌ను వెడల్పు చేస్తున్నారు. తద్వారా కొన్ని మార్గాల్లో వాహనరాకపోకలు నేరుగా పోయే విధంగా ఏర్పాట్లు చేసి, ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే చర్యలు చేపడుతున్నారు.
గాజువాక పేరు చెప్పితే మొట్టమొదటగా ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పాత గాజువాక జంక్షన్‌. అటు సింథియాను, ఇటు జాతీయరహదారిపై అటూఇటూ ఉన్న మార్గాలు ఈ జంక్షన్‌ ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ వలయంగా ఉంటుంది. జాతీయ రహదారిపై వెళ్లే లారీలు, ఇతర వాహనాలు, సిటీ, రూట్‌బస్సులు, విద్యాలయాలు, ఫార్మా, ఇతర కంపెనీలకు రాకపోకలు సాగించే వందలాది భారీ వాహనాలకు అంతకుమించిపోయేలా ఆటోలు, కార్లు, ఇతర చిన్నవాహనాలు, వేలసంఖ్యలో ద్విచక్రవాహనాలతో గాజువాక సెంటర్‌ వాహనరద్దీతో హోరెత్తిపోతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈజంక్షన్‌ను అరగంటలోపు దాటిపోతే తొందరగా వెళ్లిపోయినట్లే..
ఇలా నిత్యం వేలాది వాహనాలతో విపరీతమైన రద్దీతో ఉన్న పాతగాజువాక జంక్షన్‌లో ట్రాఫిక్‌ నియంత్రణకు ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు కొన్నేళ్లుగా కాగితాల్లోనే నలిగిపోతూ, నిధుల లేమి అంటూ కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు అభివృద్ధి విస్పోటనం పుణ్యమాని నానాటికీ పెరిగిపోతున్న వాహనరద్దీతో పాతగాజువాకలో ట్రాఫిక్‌ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారగా, ప్రజలు, వాహనదారులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం,సాయంత్రం వేళల్లో భారీ ట్రాఫిక్‌
పాత గాజువాక జంక్షన్‌తోపాటు అటు శ్రీనగర్‌ రైల్వే ఫ్లైఓవర్‌, ఇటు బిహెచ్‌పివి వరకు, కొత్తగాజువాక రూటులో కన్యశ్రీకన్య జంక్షన్‌ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో భారీ ట్రాఫిక్‌తో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్‌ వైపు నుంచి నగరంలోకి వెళ్లే వాహనాలు నేరుగా పోయేందుకు ప్రత్యేకంగా మార్గం ఉన్నప్పటికీ, ఇక్కడ ట్రాఫిక్‌ సిగల్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి, నాలుగైదు పర్యాయాలు సిగల్‌ పడినా దాటివెళ్లే పరిస్థితి ఒకేసారి ఉండదంటే ఎంత ట్రాఫిక్‌ ఉంటుందో ఇట్టే అర్థమౌతుంది.
జంక్షన్‌ విస్తరణతో తాత్కాలిక ఉపశమన చర్యలు
ఈ నేపథ్యంలో పాతగాజువాక జంక్షన్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించాలంటే ఇక్కడున్న జంక్షన్‌ను, రోడ్లను విస్తరణ చేయడమొక్కటే తాత్కాలిక ఉపశమన చర్యలుగా భావించిన అధికారులు, ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. పాతగాజువాక జంక్షన్‌లో డివైడర్లు, చిన్న పార్కుగా ఉన్న ప్రాంతాలను తొలగించి, రెండు రోజులుగా రోడ్డు వెడల్పు చేస్తున్నారు. ఒకేసారి మూడు మార్గాల్లో వాహనాలను మళ్లించడం ద్వారా ఈ జంక్షన్‌లో ట్రాఫిక్‌ రద్దీని తాత్కాలికంగా నియంత్రించే పనులు చేపడుతున్నారు. పనులు పూర్తయిన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.