ప్రజాశక్తి-సీతానగరం, పార్వతీపురం : భూ సమగ్ర రీ సర్వే పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో రైతుల భూములను, వాస్తవ సాగుదారులను గుర్తించి సాగు దారుల పేర్లు, సర్వే నంబర్లు సరి చేయాలని రైతులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్ వద్ద రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. అంటిపేట రెవెన్యూ గ్రామ పరిధిలో గల రైతుల భూముల వివరాలు తప్పులు తడకలుతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారని అన్నారు. ప్రభుత్వం కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా భూ సర్వే ఉందని అన్నారు. అనంతరం కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రైతులు మూడడ్ల రాఘవ, రెడ్డి సత్యనారాయణ, రెడ్డి నారాయణ రావు, రెడ్డి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం చేయాలని ధర్నా
రైతుల భూములను బలవంతంగా అటవీశాఖకు బదలాయించే నిర్ణయం ఉపసంహరించుకోవాలని సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బి.వి.రమణ మాట్లాడుతూ గరుగుబిల్లి మండలంలోని గొట్టివలస, ఉల్లిభద్ర, దలాయివలస రెవెన్యూ పరిధిలో అనేక సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న రైతులకు 2008లో ప్రభుత్వం డి-పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు. ఆ భూముల్లో టేకు, నీలగిరి, జీడి, మామిడి మొక్కలను నాటారని తెలిపారు. రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్ 272, 273, 274లో ఉన్న రైతులను కనీసం సంప్రదించకుండా వారి భూములను అటవీ శాఖకు బదలాయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటవీశాఖకు బదలాయి ంచిన భూమిని గొట్టివలస సర్వే నంబర్ 279గా అధికారుల పేర్కొని, పట్టాలు పొంది సాగులో ఉన్న రైతులను తొలగించడం దారుణమన్నారు. ఓ మత పూజా సామగ్రిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దౌర్జన్యంగా ట్రెంచ్ నిర్మాణం చేస్తున్నారని, తక్షణమే ఈ పనులను నిలుపుదల చేయాలని ఆర్‌డిఒ హేమలతకు వినతి అందించారు. కార్యక్రమంలో సుంకి సర్పంచ్ కరణం రవీంద్ర, బొండపల్లి ప్రసాదరావు, బోను శంకరరావు, బోనెల వెంకటి తదితరులు పాల్గొన్నారు.










