ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్/రూరల్ : జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించకపోవడం దుర్మార్గమని, వెంటనే దీనిపై ప్రకటన చేసి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర బుధవారంతో ముగిసిన సందర్భంగా స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా పాతబస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థ నిర్వీర్యం చేసేలా తమ విధానాలను అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసేలా అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న జగనన్న ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవలేక, చదువులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుందన్నారు. జిల్లాకో ఎయిర్ పోర్టులను ప్రకటించిన జగన్ జిల్లాకో యూనివర్సిటీ ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లకు బకాయిలుగా నిలిచిన మెస్ (డైట్) బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, డిగ్రీలో తీసుకువచ్చిన హనర్స్ - మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులు ఇంటర్న షిప్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని, 117 జిఒ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లలో పర్మినెంట్ వర్కర్లను, వార్డెన్లను నియమించాలని, పోస్టుమెట్రిక్ హాస్టల్‌కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఎఎన్‌ఎంలను నియమించాలని, నిరంతరం మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, కురుపాం ఇంజనీరింగ్ కళాశాల పనులు త్వరితగా పూర్తి చేయాలని, నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లకు ఆర్‌ఒ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, గురుకులం, ఆశ్రమ, కెజిబివి, ఏకలవ్య పాఠశాలల్లో, హాస్టళ్లలో సీట్లు పెంచాలని, నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని, మంచినీరు, మరుగుదొడ్లు, లైట్లు ఫ్యాన్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని, హై స్కూల్, యుపి పాఠశాలల్లో అన్ని పోస్టులు కొనసాగించాలని, సిఆర్టీ, భాష వాలంటీలను రెగ్యులరైజేషన్ చేయాలని, యువజన శిక్షణ కేంద్రాలలో సీట్ల సంఖ్య పెంచాలని, ప్లేస్మెంట్లను అందుబాటులో గల పరిశ్రమలల్లో కల్పించాలని, జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మెడికల్ కళాశాలకు స్థలం కేటాయించి పనులు వెంటనే ప్రారంభిం చాలని జిల్లా కేంద్రంలో ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లు పరిస్కారం చేయాలని, లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు డి. పండు, పి.రాజశేఖర్ మాట్లాడుతూ పై సమస్యల పరిష్కారానికి నవంబర్ 1నుంచి 8వరకు పార్వతీపురంలో రిలేనిరాహారదీక్షలు, 9న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గసభ్యులు కె. రాజు, హెచ్.సింహాచలం, బి.గంగారావు, కె.భాస్కరరావు, నాయకులు అఖిల్, ఉమాశంకర్, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










