
పార్వతీపురం: జిల్లా యంత్రాంగం అనుభవపూర్వక అభ్యాస కేంద్రంగా ఇన్నోవేషన్ హబ్ ప్రతిపాదనను నీతి ఆయోగ్ ప్రశంసించింది. మౌలిక సదుపాయాల రంగంలో పనులు విజయవంతంగా పూర్తి, దూర ప్రాంతాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటుపై నీతి ఆయోగ్ ప్రశంసించింది. జిల్లాలో నీతి ఆయోగ్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఇన్నోవేషన్ హబ్, అనుభవపూర్వక అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం బుధవారం ఆశావాహ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆశావాహ జిల్లాల కింద పార్వతీపురం మన్యం జిల్లాకు నీతి ఆయోగ్ ప్రోత్సాహకంగా రూ.3 కోట్లు మంజూరు చేసి ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. పార్వతీపురంలో అనుభవపూర్వక అభ్యాస కేంద్రమైన ఇన్నోవేషన్ హబ్ను స్థాపించడానికి పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం ప్రాజెక్టును సిద్ధం చేసింది. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అనుభవ పూర్వకంగా విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం, పరిశీలన, డేటా రికార్డ్ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను పెంపొందించడం, నాణ్యమైన విద్యను సాధించడం, విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉన్నత చదువులు చదవాలనే సంకల్పంతో ప్రతిపాదించామన్నారు. కాన్సెప్ట్ అవగాహన ద్వారా నైపుణ్యాలు, జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని ఈ ప్రాజెక్టులో పొందుపరిచామని చెప్పారు. జెఎన్‌టియు, ఆంధ్రా యూనివర్సిటీ తదితర ప్రాంతాల నుంచి మాస్టర్ ట్రైనర్లను గుర్తించామని తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. జీవ, భౌతిక, ఖగోళ, రసాయన శాస్త్ర ప్రయోగశాలలను సంబంధిత నమూనాలతో ప్రతిపాదించారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉంటారు. సివిల్ పనులు, అన్ని నమూనాలను కొనుగోలు 15 రోజుల్లో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం యోచిస్తోందన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఆర్‌డిఒ కె.హేమలత ప్రాజెక్టును సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టుకును సిఇఒ సుబ్రహ్మణ్యం ప్రశంసించారు. ఇది మంచి ప్రతిపాదననని, అటల్ టింకరింగ్ ల్యాబ్లోని నీతి ఆయోగ్ జాతీయ స్థాయి ఎగ్జిక్యూటివ్ బృందం మద్దతు ఇస్తుందని, అందుకు నోడల్ అధికారిని నియమించాలని కోరారు. ఈ మేరకు ఆర్‌డిఒను నోడల్ అధికారిగా నియమించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి, ఆర్‌డిఒ, ఇంటర్ విద్యాశాఖాధికారి డి.మంజులవీణి, డిఇఒ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.