ప్రజాశక్తి-ఆలూరు
వైసిపి అభివృద్ధి కోసం కష్టపడే ప్రతి కార్యకర్తనూ గుర్తించి పార్టీ పట్టం కడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. సోమవారం ఇబ్రహీం ఫంక్షన్ హాలులో ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. మార్కెట్ యార్డు కార్యదర్శి శాంతి కుమార్ అధ్యక్షత వహించారు. అంతకుముందు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ, సభ్యులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మంత్రి స్వగృహం నుంచి మంత్రి జయరాం, సోదరులు శ్రీనివాసులు, నారాయణ స్వామితో కలిసి పెద్దఎత్తున ఓపెన్ కార్ కాన్వాయిలో డప్పుల మోతతో ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. చిప్పగిరి మండలం బెల్డోన సర్పంచి సావిత్రి భర్త గోవిందు, సోదరుడు గోపాల్‌కు మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో జగనన్న పథకాలను కాపీ కొట్టారన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణ స్వామి మాట్లాడుతూ... చిప్పగిరి మండలంలో కన్వీనర్‌గా ఉన్న నారాయణ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిగా ఏకగ్రీవం చేసిన ఘనత సోదరుడు నారాయణకే దక్కుతుందని చెప్పారు. పార్టీ గుర్తించి మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా పట్టం కట్టిందన్నారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.... తనపై నమ్మకంతో పార్టీ, గుమ్మనూరు సోదరుల నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు. పార్టీ కోసం తమ అన్నలు, గుమ్మనూరు సోదరుల కోసం ఏమైనా చేయటానికి వెనకాడబోమని చెప్పారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ చిన్న ఈరన్న, ఏరూరు చంద్రశేఖర్, దొరబాబు, కిట్టు, లింగప్ప, ఎంపిపిలు రంగమ్మ, ఈషా, మాదేవి, సొసైటీ ఛైర్మన్లు హనుమంతమ్మ, శీనప్ప, గోవర్ధన్, నిరంజన్ ప్రసాద్, మండల కన్వీనర్లు వీరేష్, పెద్దయ్య, భీమప్ప చౌదరి, షఫీవుల్లా పాల్గొన్నారు.










