అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు దేశంపై ప్రభావం చూపినట్టే తెలుగు రాష్ట్రాల రాజకీయ గతికి తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలు తాజా సూచికలు అవుతాయి. ఈ రెండు కూడా అధికార పార్టీల స్థానాలే కావడం ఇక్కడ ఉమ్మడి అంశం. తెలంగాణలో ఇది వరుస ఎన్నికల పరంపరలో భాగంగా రాగా ఎ.పి లో స్థానిక ఎన్నికల ఫలితాల కొనసాగింపుగా వచ్చింది. తెలంగాణలో దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికలలో బిజెపి దూకుడు చూపించి ఎంఎల్‌సి ఎన్నికల్లో దెబ్బ తిన్న నేపథ్యం వుండగా ఎ.పి లో స్థానిక ఎన్నికలలో వైసిపి దాదాపు ఏకపక్ష విజయాలు సాధించింది. నేపథ్యంతో పాటు ఇప్పుడు రెండు చోట్ల పోటీల తీరు భిన్నంగా వుండటంతో ఫలితాల సరళిని గురించి మాత్రం భిన్నమైన అంచనాలున్నాయి. కాని ఇప్పటికే ఒక విషయం మాత్రం స్పష్టమై పోయింది. దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని అందులోనూ తెలుగు నాట బలంగా కాలూనినట్టు చూపించుకోవాలని బిజెపి పెట్టుకున్న ఆశలకు ఆది లోనే హంసపాదు పడింది. రెండు ఉప ఎన్నికల్లో బిజెపి ప్రధాన పోటీదారుగా లేకుండా పోయింది. హోరాహోరీ రాజకీయ పోరాటంగానే ఉప సమరం నడిచింది. కరోనా తాకిడి లోనూ పోలింగ్ బాగానే వుండటం ఇందుకొక నిదర్శనం.
మత ఎజెండా స్థానే రాష్ట్ర సమస్యలు
తిరుపతిలో అధికార వైఎస్‌ఆర్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి, టిడిపి పనబాక లక్ష్మి వుండగా బిజెపి తరపున రత్నప్రభ, కాంగ్రెస్ మాజీ ఎం.పి చింతామోహన్, సిపిఎం నుంచి యాదగిరి పోటీ చేశారు. ఇక్కడ తమ విజయం ఖాయమే గనక మెజార్టీ అయిదు లక్షల పైన వుండేట్టు చూసుకోవడమే లక్ష్యమన్నట్టు వైసిపి ప్రచారం చేసింది. తమ విజయం ఖాయమంటూనే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించవలసిన ఉత్కంఠ కూడా కనిపించింది, మంత్రులకూ ప్రజాప్రతినిధులకూ టార్గెట్లు పెట్టి మరీ రంగంలోకి దించారు. టిడిపి తరపున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉధృతంగా ప్రచారం చేశారు. వైసిపి మెజార్టీ తగ్గించి చూపగలిగితే ప్రజల్లో ఆదరణ తగ్గిందని చెప్పవచ్చుననేది టిడిపి వ్యూహంగా వుంది. తెలంగాణలో దుబ్బాక గెలిచిన తర్వాత అందరికన్నా ముందు తిరుపతి సందడి ప్రారంభించిన బిజెపి మొదట హడావుడి చేసినా తర్వాత వెనక్కు పోవడం అనివార్యమైంది. పదిహేను మంది బిజెపి నేతలు తిరుపతిలో ప్రత్యేకంగా ఫ్లాట్లు తీసుకుని ప్రచారం చేయాలనుకున్నది కాస్త మొక్కుబడి పోటీగా మారింది. హిందూ క్రైస్తవ మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగానూ, తిరుమలకు సంబంధించిన వివాదాలతోనూ అక్కడ మతపరమైన అంశాలు ముందుకు తేవాలని వేసుకున్న పాచికలు పూర్తిగా ఫలించలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం అంతా మార్చేసింది. ప్రత్యేక హోదాతో సహా ఎ.పి కి సంబంధించిన సమస్యలు ముందుకు రావడంతో బిజెపి ఆత్మరక్షణ స్థితిలో పడిపోయింది. మొదట వస్తారనుకున్న స్టార్ క్యాంపైనర్లు కూడా రాలేదు. అయినా ఆశ చావక చివరకు వైసిపి అభ్యర్థి మతం ఏమిటనే రభస కూడా లేవదీసినా ప్రధానాంశం కాలేకపోయింది. బిజెపి జనసేన సంబంధాలు కూడా ఈ క్రమంలో బహిరంగ చర్చకు, వివాదాలకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోతే బిజెపి మరీ వెలవెలబోయేట్టు కనిపించింది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు పవన్‌కళ్యాణ్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బిజెపి ఎ.పి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం ఈ తాపత్రయాన్నే ప్రతిబింబించింది గాని బిజెపి లోనే చాలా మందికి మింగుడు పడలేదు. అయినా దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఒకరోజు మాత్రమే ప్రచారం చేయగలిగారు. పవన్ పాల్గొన్న ఒక సభ లోనూ బిజెపి బాణీ లోనే మతాల ముచ్చట్లు వినిపించారు. తెలంగాణలో బిజెపి తమను ఉపేక్షించిందని ఆరోపించి దూరం జరిగిన పవన్ కళ్యాణ్ తిరుపతిలో దాన్ని పూర్తిగా మర్చిపోయి ఆ పార్టీకే ప్రచారం చేసి పెట్టడం విశేషమే. ఈ సమయంలోనే పవన్ పునరాగమన చిత్రం 'వకీల్ సాబ్' విడుదలై విజయం సాధించడంతో అది కూడా తమ విజయానికి దోహదం చేస్తుందని బిజెపి చెప్పుకోవడం హాస్యాస్పదంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ గతంలో చాలా సార్లు ప్రాతినిధ్యం వహించిన నేత అయినప్పటికీ బలమైన ప్రభావం చూపలేకపోవడం ఆ పార్టీ జాతీయ పరిస్థితికి రాష్ట్రంలో పరిస్థితికి ప్రతిబింబమైంది. నామకార్థంగా ఒకరిద్దరు నేతలు తప్ప మరెవరూ ఆయన తరపున పనిచేసింది లేదు.
నిక్కచ్చిగా నిలదీసిన వామపక్షాలు.. హిందూత్వ ఒత్తిడిలో వైసిపి
సిపిఎం అభ్యర్థి యాదగిరి పోటీలో వుండటం, సిపిఐ బలపర్చడం కమ్యూనిస్టు శ్రేణులకు ఉత్సాహం కలిగించింది. వామపక్షాలు బిజెపి తీరుపై కేంద్రీకరించి ప్రచారం చేశాయి. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం నొక్కి చెప్పాయి. టిటిడి కి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన, చేస్తున్న ద్రోహాన్ని విస్త్తృతంగా ప్రచారం గావించాయి. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ సంస్కరణలు, వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్ల బిగింపు వంటి అంశాలను వివరించాయి. వామపక్షాల పోటీ కారణంగా వైసిపి కొంతవరకైనా కొన్నిసార్లయినా బిజెపి నేతలపై విమర్శ చేయవలసి వచ్చింది. అయితే తానూ తక్కువ తినలేదన్నట్టు ఈ సమయంలోనే టిటిడి ని ఆధారం చేసుకుని కొన్ని హిందూత్వ ధోరణులను సంతృప్తిపర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో తిరుపతి కి బస్సు యాత్రలు, తిరుమల లోని అంజనాద్రినే ఆంజనేయ జన్మభూమిగా ప్రకటించడం, ఈ సమయం లోనే రమణ దీక్షితులను ఆలయ ప్రధాన పూజారిగా పునర్నియమించి ఆయనతో జగన్ విష్ణుమూర్తి అవతారమనిపించుకోవడం...అన్నీ ఇందులో భాగాలే. మొత్తంపైన వైసిపి ప్రచారం యావత్తూ టిడిపి పైన తప్ప కేంద్రం చేస్తున్న అన్యాయాల పైన నడవలేదన్నది సత్యం.
పరస్పర వ్యతిరేకతకే టిడిపి, వైసిపి పెద్దపీట
తెలుగుదేశం స్థానిక నేతలు తప్ప చంద్రబాబు వంటి వారు కేంద్ర బిజెపిపై విమర్శలకు పెద్దగా సిద్ధపడింది లేదు. జగన్‌కు వ్యతిరేకంగా వివేకానందరెడ్డి హత్య కేసు వంటి వాటిని బిజెపి తరహా మత సమస్యలను వారు ముందుకు తెచ్చారు. ఇరు పార్టీలు సవాళ్లు విసురుకున్నాయి. 'రాష్ట్రం కోసం రాజీనామాలు చేస్తారా?' అని టిడిపి సవాలు చేస్తే... 'ఈ ఉప ఎన్నికల్లో మేము గెలిస్తే మీరు రాజీనామా చేస్తారా?' అని వైసిపి ప్రతి సవాలు చేసింది. చివరలో తన ప్రచార సభపై రాళ్లు పడ్డాయని చంద్రబాబు ఫిర్యాదు చేయడం దాన్ని ఎన్నికల సంఘం వరకూ తీసుకువెళ్లడం జరిగినా పోలీసులు కొట్టిపారేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికల వాతావరణం లేదని బిజెపి ఆరోపించింది. దానిపై పాలక పార్టీ నేతలు తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రచారానికి వస్తారనుకున్నా చివరలో విరమించుకుని లేఖలతో సరిపెట్టారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నడుస్తుండగానే జెడ్‌పిటిసి ఎంపిటిసి ఎన్నికల వివాదం, కేసుల తర్వాత జరపడం, టిడిపి బహిష్కరణ ఎ.పి లో వేడిని రగిలించింది. పైకి చేసుకునే విమర్శలు చాలక ఆడియో వీడియో క్లిప్పింగులు, ఫోటోల మార్ఫింగుల వంటివి కూడా ఎన్నికల ప్రచార క్రమంలో టిడిపి వైసిపి ల మధ్య తగాదా పెంచాయి. మొత్తంపైన ఒక ఉప ఎన్నికగా గాక రాజకీయ బలాబలాల ప్రదర్శనంగా మారింది. టిడిపి హయాంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికతో దీన్ని పోల్చడం, అప్పుడు జరిగినవి ఏకరువు పెట్టడం పరిపాటి అయింది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు తమ పథకాలకు, పాలనకు ప్రజల మద్దతుగా వుంటుందని వైసిపి ప్రచారం చేసుకుంటే వారు చెప్పినన్ని లక్షల ఓట్ల మెజార్టీ రాకుంటే దాడి చేయవచ్చునని టిడిపి చూస్తున్నది.
నాగార్జున సాగర్ సంకేతాలు
తిరుపతితో పోలిస్తే నాగార్జున సాగర్‌లో ప్రచారం లోలోపల ఎక్కువగా నడిచింది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అసలు ప్రచారమే లేకుండా ఎన్నికలకు వెళదామని ప్రతిపాదించారు. టిఆర్‌ఎస్ తరపున గతంలో మరణించిన ఎంఎల్‌ఎ నోముల నరసింహయ్య కుమారుడు భగత్‌ను నిలబెట్టిన అధికార నేతలు అంతకన్నా ముందు నుంచి విస్తారంగా ప్రచారం, సమీకరణ చేస్తూ వచ్చారు. బిజెపి అభ్యర్థి రవినాయక్ పోటీలో వున్నా ద్విముఖ పోటీగానే పరిగణించబడింది. ఎంఎల్‌సి ఎన్నికల ఓటమి తర్వాత వారి ప్రచారం తీరు కూడా పరిమితంగానే నడిచింది. జగన్ తీరుకు భిన్నంగా సాగర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రకటనకు కొంచెం ముందు, ప్రచారం ఆఖరి ఘట్టంలో రెండు పెద్ద బహిరంగ సభలు జరిపారు. షరామామూలుగా తెలంగాణ కోసం తాను చేసిన పనులు ఏకరువు పెట్టి కాంగ్రెస్‌పై నిప్పులు కక్కారు. బిజెపి పై విమర్శలు ఇతర నేతలకు వదిలేశారు. జానారెడ్డి గతంలో ఏడు సార్లు ఎంఎల్‌ఎగా పనిచేశారు గనక బలమైన పోటీదారుగా వుంటారనే భావం అధికార పార్టీ అండతో భగత్ పోటీ మరోవైపు సాగర్ ఎన్నికను ఉత్కంఠ భరితం చేశాయి. తెలంగాణలో తనతో పాటు సీనియర్ నేతగా చెప్పుకోదగిన జానారెడ్డిని రానివ్వరాదనే ఆలోచన కెసిఆర్‌లో బలంగానే వున్నట్టు నియోజకవర్గంపై ఆయన చూపిన ప్రత్యేక శ్రద్ధ చెబుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ భవిష్యత్తు ఈ ఎన్నిక ఫలితంపై చాలా వరకూ ఆధారపడి వుంటుంది. ఆ పార్టీ పిసిపి అధ్యక్షుని నియామకం కూడా ఈ ఎన్నిక తర్వాతనే చేస్తామని అధిష్టానం ప్రకటించింది. ఈ సమయం లోనే టిడిపి శాసనసభా పక్షం అధికారికంగా టిఆర్‌ఎస్‌లో విలీనమైంది. మళ్లీ ఇక్కడ టిఆర్‌ఎస్ గెలిస్తే తమకు తిరుగు లేదనే ప్రచారం జోరుగా సాగించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధంగా వున్నారు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఊపును కొనసాగించలేకపోయిన బిజెపి జోరు తగ్గుతుందనే అంచనాలు బలంగా వున్నాయి. కౌన్సిల్ ఎన్నికలలో బిజెపి ఓటమిని ఆహ్వానించిన వామపక్షాలు ఈ ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక కమిటీకే ఇచ్చాయి. ఏది ఏమైనా సాగర్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలపై ఒక మధ్యంతర అంచనాగా మారనుంది.
బిజెపి పేరాశలకు గండి
రెండు తెలుగు రాష్ట్రాల లోనూ బిజెపి పేరాశలకు గండి పడటం ముందే నిర్ధారణగా చెప్పదగిన పరిణామం. మిగిలిన అంశాలు ఓటర్ల తీర్పు ఓటింగు సరళిని బట్టి చూడవలసి వుంటుంది. అందుకోసం మే 2వ తేదీ దాకా ఆగవలసిందే. దీని కొనసాగింపుగా తెలంగాణలో మున్సిపాలిటీల ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఎ.పి లోనైతే జెడ్‌పిటిసి ఎంపిటిసి ఫలితాల ప్రకటనకు హైకోర్టు అనుమతి కోరారు. తర్వాత ఎంపిపి, జెడ్‌పి అధ్యక్షుల ఎన్నిక తతంగం వుంటుంది. కనుక రానున్న చాలా రోజుల పాటు ఎన్నికల ఫలితాల వాతావరణమే కొనసాగనుంది.
- తెలకపల్లి రవి










