ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తానని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర వెల్లడించారు. రాష్ట్రంలో రాక్షసపాలనను అంతమొందించి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యాక తొలిసారి పార్వతీపురం వస్తున్న సోమవారం నరిసిపురం వద్ద మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌టిఆర్, అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ బైక్‌ర్యాలీతో పట్టణంలోని పాతబస్టాండ్‌లో ఎన్‌టిఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం టిడిపి కార్యాలయంలో జగదీష్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న నీచరాజకీయాలకు భయపడకుండా, ప్రతి కార్యకర్తలో ధైర్యం నింపుతానని చెప్పారు. తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయడమే తన తత్వమని, అందుకు అనుగుణంగా పనిచేసి అందరిని కలుపుకుపోతానని తెలియజేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.










