Dec 13,2022 23:52

సమావేశంలో మాట్లాడుతున్న అక్కరమాని విజయనిర్మల

ప్రజాశక్తి - ఆరిలోవ : పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్తా సైనికుని వలే కృషిచేయాలని వైసిపి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పిలుపునిచ్చారు. జివిఎంసి 9, 12, 13 వార్డుల కార్పొరేటర్లు కోరుకొండ స్వాతీదాస్‌, అక్కరమాని రోహిణి, కెల్ల సునీత, 10వ వార్డు వైసిపి ఇన్‌ఛార్జి జగ్గుపిల్ల అప్పలరాజు ఆధ్వర్యాన మంగళవారం కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి సచివాలయానికీ ముగ్గురు కన్వీనర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు గృహ సారధులను కూడా నియమిస్తున్నట్టు చెప్పారు. వీరందరూ సమన్వయం చేసుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేవిధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అక్కరమాని వెంకటరావు, ఆయా వార్డుల వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.