Nov 13,2023 19:26

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న చంద్రశేఖర్‌ రెడ్డి అనుచరులు​​​​​​​

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో చంద్రశేఖర్‌ రెడ్డి అనుచరుల ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని, అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల వివరాల మేరకు... పార్లపల్లిలోని సర్వే నెంబర్‌ 261లో గతంలో ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఈ సర్వే నెంబర్‌లో 241 పట్టా నెంబర్‌ గల 0.3 సెంట్ల స్థలాన్ని కుమ్మరి సరోజమ్మకు ఇచ్చారు. సరోజమ్మ అదే గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లుకు అమ్మేశారు. అదే పట్టాలో మూడు సెంట్లలో ఒకటిన్నర సెంటును తహశీల్దార్‌ ఇచ్చారని టోపీ నరసింహులు వచ్చి గొడవ చేస్తున్నారు. మొదట కమ్మరి సరోజమ్మకు పట్టా ఇచ్చారు ఆమె హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. కుమ్మరి వెంకటేశ్వర్లు, టోపీ నరసింహులు కూడా చంద్రశేఖర్‌ రెడ్డి దగ్గరకు పంచాయితీకి వెళ్లారు. కుమ్మరి వెంకటేశ్వర్లు కొన్న మూడు సెంట్ల స్థలంలో బండలు పాతుకున్నారు. చంద్రశేఖర్‌ రెడ్డి టోపీ నరసింహులును రెచ్చగొట్టి బండలను పగులగొట్టి తన అనుచరులను రెచ్చగొట్టి పంపారు. ఆదివారం బండలు తీస్తున్న చంద్రశేఖర్‌ రెడ్డి అనుచరులను కుమ్మరి వెంకటేశ్వర్లు భార్య ఆపేందుకు వెళ్లారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం వారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇది అధికారుల నిర్లక్ష్యమేనని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని చెబుతున్నారు. గతంలో ఎస్పీ హెచ్చరించినా చంద్రశేఖర్‌రెడ్డికి బుద్ధి రావడం లేదని పేర్కొంటున్నారు.