Jul 25,2023 23:37

గుంటూరులో నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

ప్రజాశక్తి - గుంటూరు లీగల్‌ : మణిపూర్‌లో జాతి వైషమ్యాలు, మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా సిపిఎం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శనలు చేశారు. ఇందులో భాగంగా గుంటూరులో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు మెయిన్‌గేటు నుండి గుర్రం జాషువా విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. సీనియర్‌ అడ్వకేట్‌ చెరుకూరి సత్యనారాయణ, రుక్మిణి, ఐలు జిల్లా ఉపాధ్యక్షులు జి.శేషగిరిరావు మాట్లాడుతూ మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సిద్దా సత్యనారాయణ, నందకుమారి, జె.నరసింహారావు, సురేష్‌, అనురాధ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తెనాలి : సిపిఎం, సిఐటియు, ఐద్వా ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక అన్నాబత్తుని పుర వేదిక నుంచి ప్రారంభమైన ప్రదర్శన మెయిన్‌ రోడ్డు మీదుగా గాంధీ చౌక్‌ వరకు కొనసాగింది. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.బాబుప్రసాద్‌ మాట్లాడుతూ మణిపూర్లో 85 రోజులుగా దమనకాండ కొనసాగుతోందని, మహిళల మానప్రాణాలను కాపాడలేని మణిపూర్‌ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అక్కడి పరిస్థితిని గమనించి కూడా మౌనంగా ఉన్న ప్రధాని మోడీ గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ దుర్మార్గానికి ప్రతీకగా మణిపూర్‌ ఘటనలు నిలిచాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.శివసాంబిరెడ్డి, సిఐటియు డివిజన్‌ కార్యదర్శి షేక్‌ హుస్సేన్‌వలి, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌.వెంకటేశ్వర్లు, గౌరీ, మాధవి, సునీత పాల్గొన్నారు. కొల్లిపర మండల కేంద్రంలో సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాలు సంయుక్తంగా నిరసన ర్యాలీ నిర్వహించాయి. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన కూడా మణిపూర్‌ అల్లర్లుపై పెదవి విప్పకపోవడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.చంద్రశేఖర్‌, ఎఐటియుసి నాయకులు బాలస్వామి, రైతు సంఘ నాయకులు ఎం.సాంబశివరావు, నాయకులు ఎం.రమేష్‌, జి.సుందర్రావు పాల్గొన్నారు. తెనాలిలో కోర్టు ప్రాంగణం వెలుపల బార్‌ అసోసియేషన్‌ నిరసన వ్యక్తం చేసింది. అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పలువురు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని, హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నా కనీసం అక్కడి అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్లో శాంతి నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు.
ప్రజాశక్తి-దుగ్గిరాల : మండలంలోని పాస్టర్ల సమావేశం స్థానిక ఎస్సీ కాలనీలోని చర్చి వద్ద నిర్వహించగా దుగ్గిరాల మండలం పాస్టర్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు ఉన్నం సురేష్‌ కుమార్‌ మాట్లాడారు. మారణకాండలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఈనెల 31వన మండలంలోని అన్ని గ్రామలకు చెందిన ప్రజలతో దుగ్గిరాలలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాస్టర ఫెలోషిప్‌ సెక్రెటరీ జె.విజయరాధ, సిహెచ్‌.బుజ్జి, గౌరవాధ్యక్షులు జాన్‌ మిల్టన్‌, సుబ్బారావు, సుందర్‌సింగ్‌, యు.రాజశేఖర్‌, ఎంపిటిసి ఎం.అరుణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పొన్నూరు రూరల్‌ : బహుజన సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో శాంతిర్యాలీ చేశారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మలమడుగు నిరీక్షణరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి వై.కిషోర్‌, మండల అధ్యక్షులు చుక్క కిషోర్‌ మాట్లాడారు.