Jun 13,2023 23:36

జమ్మిచెరువు పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి, మేయర్‌ హరివెంకటకుమారి

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఒకటో జోన్‌ పరిధిలో జివిఎంసి నిర్వహణలో ఉన్న పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రూ.19 లక్షలతో జివిఎంసి రెండో వార్డు పరిధి గొల్లలపాలెం ఇండోర్‌ స్టేడియం మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు, మూడో వార్డు పరిధి జమ్మిచెరువు పార్కు అభివృద్ధిలో భాగంగా రూ.85 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మేయర్‌ గొలగాని హరివెంకటకుమారితో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. పార్కులో సరిపడా విద్యుత్‌ లైట్లు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నట్లు వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు, కొందరు సందర్శకులు ఎమ్మెల్యే, మేయర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మేయర్‌ సానుకూలంగా స్పందిస్తూ అదనంగా విద్యుత్‌ లైట్ల ఏర్పాటుకు రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూడో వార్డు కార్పొరేటర్‌ గంటా అప్పలకొండ, కో-ఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి, జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, ఎఇ సుమన్‌, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.