Dec 01,2022 21:55

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
         పార్కులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఏలూరు నగర పాలక సంస్థ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు, ఈడ ఛైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం అన్నారు. స్థానిక 30వ డివిజన్‌ ఆర్‌ఎంఎస్‌ కాలనీ పార్కు అభివృద్ధికి ఈడ నిధుల నుండి రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేయర్‌ నూర్జహాన్‌ పెదబాబు, ఈశ్వరి బలరాం మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సిఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశాల మేరకు పార్కు అభివృద్ధికి ఈడ నిధుల నుండి రూ.25 లక్షలు కేటాయించామన్నారు. పార్కు అభివృద్ధిలో భాగంగా కొత్తగా పచ్చదనం కోసం గడ్డిని తీసుకొచ్చి వేయడం, పార్క్‌లో ఉన్న గడ్డిని చక్కగా కత్తిరించడం, ఇసుకతో నింపడం, గ్రానైట్‌ రాళ్లు వేయడం, వాచ్‌మెన్‌ షెడ్డు నిర్మాణం, మెయిన్‌ గేటును సరిచేయడం, రంగులు వేయడం తదితర పనులను చేసి పార్కును అందంగా, ఆహ్లాదకరంగా తయారు చేస్తామన్నారు. పార్కుకు వస్తున్న ప్రజలు పార్కు పరిసర ప్రాంతాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్‌ఎంఎస్‌ కాలనీ కమిటీ ముఖ్యంగా ఈ భాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతీ సచివాలయ పరిధిలో పారిశుధ్య పనులు, విద్యుత్‌ దీపాలు, రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిస్తూ పరిష్కరించడం జరుగు తుందన్నారు. ప్రతీ సచివాలయ పరిధిలో రూ.20 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపడతామ న్నారు. ఈ కార్యక్రమంలో ఈడ వైస్‌ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, స్థానిక కార్పొరేటర్‌ పప్పు ఉమా మహేశ్వరరావు, డిఇ వంగపండు సత్యనారాయణ, తోట శివ, ఆర్‌ఎంఎస్‌ కాలనీ కమిటీ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.