Oct 21,2023 22:57

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకదష్టి సారించాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కమిషనర్‌ నగరంలో సంతపేట, గిరింపేట, దుర్గానగర్‌ కాలనీ, కొంగారెడ్డిపల్లి ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. సంతపేట ప్రాంతంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రధాన వీధులు, రోడ్లు శుభ్రంగా ఉంచాలని, ఎక్కడా వ్యర్ధాలు లేకుండా క్రమం తప్పకుండా తొలగించాలన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు సంచారం ఉంటుందని, పారిశుధ్యం మెరుగ్గా ఉంచాలన్నారు. ఆలయాల వద్ద చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై ఎంహెచ్వో, అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గిరింపేట వద్ద పారిశుద్ధ్య నిర్వహణ తీరును, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాలను పరిశీలించారు. క్లాప్‌ వాహనం ద్వారా ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. క్లాప్‌ వాహనం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకానాథం, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు.