Apr 18,2023 23:34

బయోమైనింగ్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ తదితరులు

ప్రజాశక్తి -మధురవాడ : పారిశుధ్యంపై నిర్లక్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌వర్మ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. జివిఎంసి 31వ వార్డు పరిధి ఎంఎస్‌ఎఫ్‌-4, బీచ్‌రోడ్‌లోని జివిఎంసి స్విమ్మింగ్‌ పూల్‌, వైఎస్‌ఆర్‌ వ్యూ పాయింట్‌ (సీతకొండ), కాపులప్పాడ డంపింగ్‌ యార్డు తదితర ప్రాంతాలలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, నగరంలో వ్యర్థాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయని, ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్మికుల ఫేస్‌ మస్తర్‌ విధానాన్ని పరిశీలించారు.
ఎంఎస్‌ఎఫ్‌-4ను సందర్శించి వ్యర్థాలు ఎన్ని టన్నులు వస్తున్నాయి... ఎన్ని టన్నులు కాపులప్పాడకు తరలిస్తున్నారు... మిషనరీ పనిచేసే విధానాన్ని అడిగి తెలుసు కున్నారు. తదుపరి ఆర్‌కె.బీచ్‌రోడ్డులో ఉన్న జివిఎంసి స్విమ్మింగ్‌ పూల్‌ను సందర్శించి పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ వ్యూ పోయింట్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై కొన్ని సూచనలు చేశారు. అనంతరం కాపులప్పాడ డంపింగ్‌ యార్డును సందర్శించి బయోమైనింగ్‌ పనులను పరిశీలించారు. అవసరమైతే మరో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు రవికృష్ణరాజు, జోనల్‌ కమిషనర్లు శివప్రసాద్‌, కనకమహాలక్ష్మి, విజయలక్ష్మి, పర్యవేక్షక ఇంజినీర్లు సత్యనారాయణరాజు, శ్యాంసన్‌రాజు, ఎఎంఒహెచ్‌ డాక్టర్‌ ఎన్‌.కిషోర్‌, కార్యనిర్వాహక ఇంజినీర్లు, డిప్యూటీ ఇంజినీర్లు పాల్గొన్నారు.