ప్రజాశక్తి -సీలేరు
జీకే వీధి మండలం సీలేరు మేజర్ పంచాయతీ పారిశుభ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పంచాయితీ అధికారి టి.కొండలరావు కార్యదర్శి శ్రీనివాస్‌ను ఆదేశించారు. శనివారం సీలేరు పంచాయతీ, సచివాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఎంతమంది తదితర వివరాలను సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ లోవ కుమారిని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ అసిస్టెంట్ విజయ కుమారిని ప్రజలకు ఏఎ సేవలు అందిస్తున్నారని అడిగారు. అనంతరం ఇన్చార్జి సర్పంచ్ కే.వల్లి ప్రసాద్ ఎంపీటీసీ పిల్ల. సాంబమూర్తి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. పన్నులు వసూలు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెల 10వ తేదీ కల్లా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేసి రికార్డులు ఆధునికీకరణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాంగి లూసి, వార్డు సభ్యుడు చిటికెల రాము పాల్గొన్నారు.










