Jul 20,2022 23:53

వ్యర్థాలను తొలగింపులో కమిషనర్‌ తదితరులు

  ప్రజాశక్తి -గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ నగర అభివృద్ధికి, ప్రజలకు అందించాల్సిన సేవల పట్ల పారిశుధ్య కార్మికులు, సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు, విధులు నుంచి తొలగింపులు తప్పనిసరి అని జీవీఎంసీ కమిషన్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ పేర్కొన్నారు. బుధవారం 21వ వార్డులోని బీచ్‌ ప్రాంతంలో పారిశుధ్య పనితీరుపై తనిఖీలు నిర్వహించారు. ప్రతిరోజు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే బీచ్‌ రోడ్‌ నందు పారిశుధ్య నిర్వహణ బాగులేనందున కమిషనర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్‌ రోడ్డు సెంట్రల్‌ డివైడర్‌ వద్ద ఇసుక, మట్టి, వ్యర్ధాలు ప్రతిరోజు శుభ్రపరిచేలా విధులు చేపట్టాలని పారిశుధ్య సూపర్‌వైజర్‌కు ఇప్పటికే పలు మారులు హెచ్చరించినట్లు తెలిపారు. అయినా పారిశుధ్య పర్యవేక్షణ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో సూపర్‌వైజర్‌ ఓ.శ్రీనివాసరావు పట్ల కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావును విధులు నుంచి తొలగించాలని ప్రధానవైద్యాధికారి డాక్టర్‌ కెఎస్‌ఎల్‌జి శాస్త్రిని కమిషనర్‌ ఆదేశించారు. ఇకపై పారిశుధ్య నిర్వహణ, విధుల పట్ల ఎవరైనా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే విధులు నుంచి తొలగించడమే కాకుండా, వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు పారిశుధ్య సూపర్‌వైజర్‌ ఒ.శ్రీనివాసరావును విధులు నుండి తొలగించినట్లు ప్రధాన వైద్యాధికారి కెఎస్‌ఎల్‌జి.శాస్త్రి పేర్కొన్నారు.