Feb 24,2023 23:40

దగ్గరుండి పారిశుధ్య పనులు చేయిస్తున్న ప్రసాద్‌

ప్రజాశక్తి- కె.కోటపాడు
గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయితీ విస్తరణ అధికారి పి.ప్రసాద్‌ ఆదేశించారు. మండలంలోని చౌడువాడ గ్రామంలో శుక్రవారం పారిశుధ్య పనులను పరిశీలించారు. సంతబయలు వద్ద ఉన్న చెత్తా చెదారమును ఆయన దగ్గర ఉండి పంచాయితీ పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని 32 పంచాయతీలలో చౌడువాడ, కింతాడ, గుల్లేపళ్లి, ఎ.కోడూరు, శృంగావరం, పిండ్రంగి తదితర ఆరు గ్రామాలను సంపూర్ణంగా పారిశుధ్య నిర్వహణకు ఆరు నెలల క్రితం ఎంపిక చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆ గ్రామాలలో సంపూర్ణ పారిశుధ్యం ఏ కోసాన్న కనపడలేదన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య పనులపై అలసత్వం వహించడం తగదన్నారు. గ్రామాలలో వీధుల్లో, సందులలో పారిశుధ్య పనులు చేయకపోయినప్పటికీ కనీసం మెయిన్‌ రోడ్డు అయినా పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను ప్రతి గ్రామానికి వెళ్లి దగ్గర ఉండి పారిశుధ్య పనులు చేపట్టడం సాధ్యం కాదన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దాడి ఎరుకునాయుడు, పంచాయతీ కార్యదర్శి నక్క రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.