
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై దృష్టి సారించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పిలుపునిచ్చారు. ఆదివారం స్వచ్ఛత హి సేవలో భాగంగా పట్టణంలోని చిత్రావతి బ్రిడ్జి నుంచి బైపాస్ రోడ్డు వరకు అధికారులు ప్రజాప్రతినిధులు చీపురులు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జెసి తోపాటు డిఆర్‌ఒ కొండయ్య, మున్సిపల్ చైర్మన్ ఓబుళపతి, వైస్ చైర్మన్ మాతాంగి తిప్పన్న, ఆర్‌డిఒ భాగ్యరేఖ, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదరు భాస్కర్ తో పాటు పారిశుధ్యకార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రత గల భారతావని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శప్రభుత్వ కార్యాలయాలు వైద్యశాలలు విద్యాలయాలు ప్రైవేట్ సంస్థలు కూడా తమ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్వయంగా అధికారులే చీపురు పట్టి పారిశుధ్యం పై పనిచేయడం పట్ల ప్రజలు కూడా ఆలోచనలో పడతారని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలంటే పరిశుభ్రత ప్రాముఖ్యం వహిస్తుందని జెసి తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.