Nov 06,2023 22:42

పారిశుధ్యలోపం పల్లెల్లో జ్వరం

పారిశుధ్యలోపం
పల్లెల్లో జ్వరం
ప్రైవేట్‌లో డెంగీ
పేరుతో చికిత్స
లక్షల్లో జ్వర
పీడితులకు బిల్లు
పట్టించుకోని 'జగనన్న ఆరోగ్య సురక్ష'

ప్రజాశక్తి - బాలాయపల్లి
పల్లెల్లో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నారు. బాలాయపల్లి మండలంలోని మన్నూరు మిట్ట గ్రామస్థులను విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ జబ్బున పడుతున్నారు. దీంతో ప్రవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా జ్వరాలతోనే జనం కనిపిస్తున్నారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష పథకం' కారణంగా వైద్యాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో విష జ్వరా లు ప్రబలుతున్నాయని బాధితులు వాపోతున్నా రు. మన్నూరు మిట్ట గ్రామానికి చెందిన ఒప్పతొట్టి చిరంజీవి కుటుంబంలో ఆరుగురు ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా వరసపెట్టి జ్వరాలు వచ్చాయి. ప్రవేట్‌ వైద్యశాలకు వెళ్లడంతో కణాలు తక్కువగా ఉన్నాయని చెప్పడంతో డెంగ్యూ జ్వరం వచ్చిందని భయపడి సుమారు లక్ష రూపాయలు ఆస్పత్రికి చెల్లించాల్సి వచ్చింది.
మన్నూరు మిట్ట గ్రామంలో రెండు వారాలుగా జ్వరాలు అదుపు కాకపోవడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. గత నెల నుంచి జ్వరాలు భారిన పడుతున్నా వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు 200 మంది జీవనం గడుపుతున్నారు. దాదాపు 30 మందికి పైగా విషజ్వరాల బారిన పడి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక గ్రామంలో పారిశుద్ధ్యం పనులు చేపట్టిన దాఖలాలు లేవు. పారిశుద్ధ్యం లోపించి రాత్రయితే దోమల బెడద అధికంగా ఉంటుంది.
పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటమే విషజ్వ రాలు ప్రబలేందుకు కారణమవుతోంది. ఈగ్రామంలో 70 నివాసగహాలు ఉన్నాయి. 200 మంది నివశిస్తున్నారు. వర్షపు నీరు నిలిచి ఆ నీరు మురిగి దుర్గందమైన వాసన. ఇక మురుగు కాలువ వ్యవస్థ లేదు. దీంతో ఇళ్ల ముందే మురుగు నీరు నిలిచి అస్తవ్యస్తంగా ఉంది. ఇక ఇళ్ల చుట్టు ముళ్ళ కంప చెట్లు వల్ల దోమలకు అవాసంగా మారింది. ఇక అనేక చోట్ల నీళ్లు నిలిచి దోమల స్వైర విహారం చేస్తున్నాయి. జ్వరాలతో వద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.