
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పర్యవేక్షణ లోపం పై జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరిసర ప్రాంతాల్లో చెత్త దిబ్బలు పేరుకుపోయి దోమలు ప్రబలి దుర్గంధం వెదజల్లుతోందని వాటిని శుభ్రం చేయాలని స్థానిక మునిసిపల్ పారిశుధ్య పర్యవేక్షణ అధికారికి కోర్టుకానిస్టేబుల్ ద్వారాను, మౌఖికంగాను పలు పర్యాయాలు సమాచారం చేరవేశారు. అయితే శానిటరీ ఇన్స్‌పెక్టర్ సోమశేఖర్ క్రింది స్థాయి సిబ్బందికి సూచనలు చేయకుండా పారిశుధ్య నివారణపై నిర్లక్ష్యం వహించారు. ఈ విషయంపై జడ్జి ఫొన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. దీంతో జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ శానిటరీ అధికారికి కబురు పంపి వెంటనే తన ముందు హాజరు కావాలని ఆదేశించారు. జడ్జి పరిసరాలు అపరిశుభ్రంగా వున్నా ఎందుకు చర్యలు లోపించాయని ప్రశ్నించారు. అయితే శానిటరీ ఇన్స్‌పెక్టర్ పారిశుధ్య లోపాలను జడ్జి తెలియజెప్పారు. దీంతో జడ్జి మునిసిపల్ కమిషనర్‌ను హాజరు కావాలని ఆదేశించారు. ఇన్‌ఛార్జి కమిషనర్ స్వాతి హాజరుకాగానే జడ్జి ఆగ్రహం వ్య్క్తం చేశారు. పరిసరాల పారిశుధ్య లోపంపై న్యాయవాదులను సమక్షం లో కోర్టు చుట్టూ, ప్రత్యేక అవసరాల చిన్న పిల్లల పాఠశాల చుట్టూ నెలకొన్న చెత్తదిబ్బలు, దోమల విజృంభణను చూపెట్టారు. తమకున్న జ్యూడిషియల్ అధికారాలతో న్యాయసేవాధికార సంస్థల ద్వారా పారిశుధ్య లోపం పై ప్రజా ఫిర్యాదులను స్వీకరించి వాటిని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కింద పరిగణించి విచారణ జరిపితే ఎలాంటి చర్యలు ఉంటాయో తెలిసివస్తుందని హెచ్చరించారు. రోజువారి దినచర్యలను పారిశుద్య అధికారి విధులను ఈ సందర్బంగా జడ్జి గుర్తుచేశారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కూడా తెలుసు అని సమన్వయం తో సర్దుకుపోతున్నామని జడ్జి తెలియజెప్పారు. దీంతో శానిటరీ ఇన్స్‌పెక్టర్ స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయిస్తామని శానిటరీ ఇన్స్‌పెక్టర్ వివరించారు. సుమారు గంట పాటు కార్యాలయాల పరిసరాలలో జడ్జి కలయతిరిగారు. ఇటీవల పారిశుధ్య లోపం పైనా విషజ్వరాల బారిన పడుతున్న ప్రజల అవస్థలు ప్రతి రోజు పత్రికలలో గమనిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షులు కత్తి గంగిరెడ్డి, న్యాయవాదులు నిడిమామిడి శ్రీనివాసులు, రాజేంద్రప్రసాద్ రెడ్డి, లెక్కల యదుభూషన్, చల్లా శేఖర్ నాగేంద్ర, పోలీసు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.