పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ పరిధిలోని అట్టడుగు పేద ప్రజలు నివసిస్తున్న ఎస్.సి., ఎస్.టి. కాలనీలో చెత్తా చెదారం పేరుకుపోయి, అక్కడ నివసించే ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడి అనారోగ్యం పాలవుతున్నారని, తక్షణం ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని పరిశుభ్రం చేసే పనులు వేగవంతం చేయాలని జిల్లా ఎస్.సి., ఎస్.టి. జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఇస్కల సాయిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు కావలి మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన పరిసర ప్రాంతాలలో, మురుగు నీటి కాలువలలో వ్యర్థ పదార్థాలు చేరి దోమలు, ఈగలు ఎక్కువుగా ఉత్పత్తి అయి ఆయా కాలనీలలో ఉండే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ముఖ్యంగా ఆర్‌టిసి బస్టాండు నుండి డిపోకు పోయే రహదారిలో, ట్రంకు రోడ్డులో ఉన్న మురికి కాలువల్లో మారుమూల ఎస్.టి. కాలనీలో చెత్తా చెదారాలు ఎక్కువుగా పేరుకు పోతున్నాయన్నారు. తద్వారా పేద బలహీన వర్గాల ప్రజలు రోగాల పాలవుతున్నారు. అదేవిధంగా పట్టణ పరిధిలో ఉన్న ఎస్.సి, ఎస్.టి. కాలనీల్లో ఉన్న ప్రభుత్వ బావులను శుద్ధి చేసి, మంచి నీటిని కూడా పేద ప్రజలకు అందించాలని కోరారు. అలాగే ఆయా కాలనీలలో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు, చర్చిల దగ్గర చెత్తాచెదారం లేకుండా శ్రద్ద వహించాలని కోరారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పేద, బడుగు బలహీన వర్గాల కాలనీలలో ప్రతి నిత్యం రహదారులను, కాలువలను శుభ్రం చెత్త నిలవ చేసే కేంద్రాల వద్ద బ్లీసింగ్ చల్లి పరిశుభ్రమైన వాతావరణం అందించి, చెడు వాసనల తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి శుభ్రత- పరిశుభ్రత పాటించాలని ప్రజలకు తెలియజేసేలా మున్సిపల్ అధికారులు ప్రతి నిత్యం పర్యవేక్షించేటట్లు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.










