
ప్రజాశక్తి ..ఒంగోలు సబర్బన్ : వర్షపునీరు రోడ్ల మీద నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలని, కాలువలు, రోడ్లను శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఇందిరమ్మ కాలనీ, జర్నలిస్టు కాలనీల్లో గురువారం పర్యటించారు. రోడ్లుమీద నిల్చిన వర్షపునీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రోడ్లు, కాలువలు నిర్మించాలని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే ప్రాధాన్యత క్రమంలో రోడ్లు, కాలువలు నిర్మిస్తామని స్థానికులకు కమిషనర్ హామీ ఇచ్చారు. ఈపాటికే టెండర్ల పక్రియ ప్రారంభమైందని తెలిపారు. చెత్తను కాలువలుర, రోడ్లమీద వేయవద్దని, క్లాప్ ఆటోలకు మాత్రమే అందజేయాలని సూచించారు. అనంతరం కొత్తపట్నం రోడ్డు, నెల్లూరు బస్టాండ్ వద్ద డివైడర్ల మధ్య పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. వాటి సంరక్షణకు పలు సూచనలు చేశారు.
సచివాలయంలో ఆకస్మిక తనిఖీ
పెళ్లూరు సచివాలయాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది హాజరు, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది మూమెంట్ రిజిస్టర్‌లో ఇన్‌టైం, అవుట్ టైం నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని సూచించారు. సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలన్నారు. సిఐ రిజిస్టర్, స్పందన రిజిస్టర్‌లను పరిశీలించి, స్పందనలో వచ్చిన అర్జీలలో ఉన్న ఫోన్ నెంబర్లు ఆధారంగా ఫిర్యాదు దారులతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కారం అయ్యాయో...? కాలేదో అని అడిగి తెలుసుకున్నారు. ఇంటిపన్నులు, నీటి పన్నుల వసూళ్లపై సిబ్బందితో సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పన్నులు వసూలు చేయాలని సూచించారు.