Mar 19,2023 23:54

సిబ్బందికి పలు సూచనలిస్తున్న జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు

ప్రజాశక్తి-విశాఖపట్నం : పారిశుధ్య నిర్వహణలో ఆలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని జివిఎంసి కమిషనర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. పోతిన మల్లయ్యపాలెం క్రికెట్‌ స్టేడియం తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులను అధికారులతో కలసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, పారిశుధ్య పనుల పట్ల అలసత్వం వహించకుండా నిర్వహించాలని, జి-20 సదస్సు నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రాంతాలను తెలిపే సూచిక బోర్డులు, విద్యుత్తు, గ్రీనరీ, ఫుట్‌పాత్‌ల మరమత్తులతోపాటు పెయింటింగ్‌ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్లు వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు రవికృష్ణరాజు, డిడిహెచ్‌ ఎం.దామోదరరావు, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (యుసిడి) పాపునాయుడు, పర్యవేక్షక ఇంజినీర్లు శ్యామ్సన్‌రాజు, వినరుకుమార్‌, డీసీపీ పద్మజ, జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, ఎఎంఒహెచ్‌ డాక్టర్‌ ఎన్‌.కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.