ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నేపథ్యంలో పలు గ్రామాల్లో వర్షపు, మురుగునీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వీటి వల్ల వ్యాధులు ముసురుతున్నాయి. విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు డెంగీ జ్వర పీడితులు పెరుగుతున్నారు. పారిశుధ్యాన్ని మెరుగు పరచాల్సిన పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. చేసేదేమీ లేక సర్పంచులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్‌లో 213 పంచాయతీలు, కాకినాడ డివిజన్లో 172 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 385 పంచాయతీలుండగా మెజారిటీ గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోవడంతో దోమలకు నిలయాలుగా మారాయి. పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు కూడా దర్శనమిస్తుండడంతో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం కండ్ల కలక అంటు వ్యాధి బాగా ఎక్కువగా ఉంది. దానికి తోడు సీజనల్ వ్యాధులు ముసురుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 62 డెంగీ కేసులు నమోదవగా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ బాధితులు ఉన్నారు. వ్యాధులు ముసురుతున్న వేళ పలువురు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.
నిధుల్లేక పంచాయతీలు విలవిల
పలు పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పారిశుధ్యం మెరుగుపరిచే విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. కాలువల్లో పూడిక, వ్యర్థాలు పేరుకుపోయాయి. దోమల నివారణ చర్యలు చేపట్టడంలో పంచాయతీ అధికారులు సిబ్బంది ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నారు. మందులు పిచికారీ చేయడం లేదు. పలు గ్రామాల్లో ఫాగింగ్ ఊసే లేదు. 2022-23 గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నుంచి మొదటి విడతగా అన్ని పంచాయతీలకు రూ.26.75 కోట్లు నిధులు గత నెలలో జమ అయ్యాయి. వాస్తవానికి ఈ నిధుల నుంచి 30 శాతం సిబ్బంది జీతాలకు, 50 శాతం విద్యుత్ బిల్లులకు 20 శాతం శానిటేషన్ నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తొలి విడతలో విడుదలైన నిధుల్లో రూ.6 కోట్ల 75 లక్షల 16 వేలు విద్యుత్ బిల్లులకు, రూ.7 కోట్ల 42 లక్షల 6 వేలు విద్యుత్ దీపాలు నిర్వహణకు ఎనర్జీ ఏపీషియన్సీ సర్వీసెన్ లిమిటెడ్ (ఇఇ ఎస్‌ఎల్)కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇంకా 12.57 కోట్లు మాత్రమే పంచాయతీ ఖాతాల్లో ఉన్నాయి. మిగిలి ఉన్న నిధులను సచి వాలయాల నిర్మాణ పనుల్లో భాగంగా ప్రభుత్వం ఫీనిషింగ్ వర్కుల నిమిత్తం వాడుతున్నారు. దీంతో పారిశుధ్య నిర్వహణ కష్టంగా మారింది. పారిశుధ్య నిర్వహణలో భాగంగా సిబ్బంది జీతాలు, బ్లీచింగ్, ముగ్గు, కాలువల్లో సీల్డ్ తొలగింపు తదితర పనులను కొన్ని పంచాయతీలు సాధారణ నిధుల నుంచి వినియోగిస్తున్నారు. సాధారణ నిధులు లేని పంచాయతీలు మాత్రం పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేసినట్లు ఆయా గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గ్రామ సర్పంచులు ఆందోళన బాట పట్టి జిల్లా కలెక్టర్ల వినతి పత్రాలు అందించారు. సాధారణ నిధులు సరిపోని నేపథ్యంలో అనేక పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్లకు, ఇతర సిబ్బందికి 6 నుంచి 9 నెలలు వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్థిక సంఘం నిధులను ఎక్కువగా పారిశుధ్య నిర్వహణకే ఖర్చు చేయాల్సి ఉంది. అయితే వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తున్న తరుణంలో గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక కొన్ని పంచాయతీల్లో సర్పంచులు తమ సొంత సొమ్ములను వెచ్చించి పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. కొందరైతే అప్పులు చేసి నిర్వహిస్తున్నారు. సాధారణ నిధులను సైతం ఖర్చు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని పలువురు సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










