Aug 29,2023 21:22

మున్సిపల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి - పార్వతీపురంటరౌన్‌ : పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మున్సిపల్‌ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బోనుగౌరీశ్వరి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అజెండాలోని పొందుపరిచిన 20 అంశాలను మున్సిపల్‌ అధికారి చదివి వినిపించగా, పురపాలక సంఘం పరిధిలో నిర్వహించ తలపెట్టిన పలు అభివద్ధి పనులకు కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీరో అవర్‌లో పాత బస్టాండ్‌ సిసి రోడ్డుపై వేసిన క్రషర్‌ బుగ్గి వల్ల ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పలు ప్రభుత్వ నిధులు ఉండగా మున్సిపల్‌ సాధారణ నిధులను ఖర్చు పెట్టడం ఏమిటని 14వ వార్డు టిడిపి కౌన్సిలర్‌ ద్వారపు రెడ్డి శ్రీదేవి ప్రశ్నించారు. కొత్తవలసలో 5, 6, 7, 8 వార్డుల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయ జరుగుతుందని, రెండో సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని, అలాగే పట్టణంలో మహిళలకు పలుప్రాంతాలలో సులభ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయాలని, వార్డుల్లో పారిశుధ్యానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని 8వ వార్డు టిడిపి కౌన్సిలర్‌ నారాయణరావు కోరారు. అన్ని వార్డుల్లోనూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పురపాలక యంత్రాంగం వచ్చే సెప్టెంబర్‌లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి పూర్తి స్థాయిలో అన్ని కాలువలు శుభ్రం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్లు, ఫ్లోర్‌ లీడర్‌, పలువురు కౌన్సిలర్‌ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.