Sep 23,2023 19:59

ప్రజాశక్తి - పెదపాడు
           ప్రజారోగ్యంతో ముడిపడిన పారిశుధ్య కార్మికులకు గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. శనివారం పెదపాడు గ్రామంలో ఉన్న చెత్తనుండి సంపద తయారీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కాఫీ విత్‌ క్లాప్‌ మిత్ర కార్యక్రమం జిల్లా పరిషత్‌ సిఇఒ కె.రవికుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్‌, సిఎం జగన్‌ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాలు సంపూర్ణ పారిశుధ్యానికి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. పారిశుధ్య కార్మికులు గ్రామాల్లో లేకపోతే ఆరోగ్యం కుంటు పడుతుందని తద్వారా డెంగీ, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు ప్రబలి ప్రజలు అనారోగ్యం పాలవుతారని తెలిపారు. దీనిని అధికమించడా నికి పారిశుధ్య కార్మికులు చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లోను కాఫీ విత్‌ క్లాప్‌ మిత్ర కార్యక్రమం నిర్వహంచి పారిశుధ్య కార్మికుల సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు.
వచ్చేనెల రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రతీ మండలకేంద్రంలో ప్రయివేటు, ప్రభుత్వ డాక్టర్ల చేత వైద్య శిబిరాలను పారిశుధ్యకార్మికులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రక్తపరీక్షలు చేసి వారికి నాణ్యమైన వైద్యం సేవలు అందిస్తారని అలాగే హెల్త్‌ కార్డులు అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు. పారిశుధ్య కార్మికుల పిల్లలకు పూర్తిస్తాయిలో విద్య అందించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, వసతిదీవెన, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పారిశుధ్య కార్మికులతో మమేకమై వారి సమస్యలను, వారు చేస్తున్న విధుల గురించి వారి కుటుంబ విషయాలను స్నేహపూర్వకంగా ముచ్ఛటించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి కలెక్టర్‌, ఇతర అధికారులు కాఫీ తాగారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సన్మానించి కాస్మోటిక్‌ కిట్లను అందించారు. అనంతరం చెత్తనుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నిర్మలజ్యోతి, డిఎల్‌పిఒ చంద్రశేఖర్‌, సర్పంచి జీవనజ్యోతి, ఎంఇఒ నరసింహమూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భీమడోలు:కరోనాను అదుపు చేసే క్రమంలో క్లాప్‌మిత్రలు అందించిన సేవలు అభినందనీయమని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ అన్నారు. గుండుగొలను గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామ పంచాయతీ, సచివాలయ, ఇతర శాఖల సిబ్బంది మరియు ఉద్యోగులు, ప్రజా ప్రతి నిధులు, ప్రముఖుల భాగస్వామ్యంతో పుర వీధులలో నిర్వహించిన స్వచ్ఛహిత- ఇ -సేవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచా యతీ సర్పంచి లక్ష్మి, ఉప సరర్పంచి ముదుండి సూర్యనారాయణరాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి మురళి పాల్గొన్నారు.