Apr 29,2023 00:23

అరకులో ఆందోళన చేపడుతున్న నాయకలు, కార్మికులు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:పాడేరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, అరకులోయ ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అరకులోయ ఏరియా ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్‌, ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రఘు మాట్లాడుతూ, పాడేరు, అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు ఆసుపత్రుల్లో పని చేస్తున్న ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఒక్కొక్క కార్మిడికి రూ.16000 జీతాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఒక్కొక్క కార్మికులకు రూ.9,000 నుండి 10,700 వరకు మాత్రమే జీతాలు చెల్లిస్తుందన్నారు. సెక్యూరిటీ గార్డులకు రూ.8,300 మాత్రమే చెల్లిస్తున్నారని తక్షణమే ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌, ఈఎస్‌ఐ కార్మికుల నుండి వసూలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం ఈఎస్‌ఐ చెల్లించడం లేదని తక్షణమే కాంట్రాక్ట్‌ విధానం రద్దు చేసి వైద్య విధాన పరిషత్‌ కింద జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో 200 పడకలకు గాను వంద పడకల సిబ్బందితోనే పని చేయిస్తున్నారని, అరకు ఏరియా 150 పడకల ఆసుపత్రిలో వంద పడకల సిబ్బందితో పని చేయిస్తున్నారని, పని భారం ఎక్కువ కావడంతో కార్మికులకు తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇబ్బందీ పడుతున్నారని పేర్కొన్నారు. తగినంత సిబ్బందిని వెంటనే నియమించి పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు ఫేషియల్‌ యాప్‌ విధానం రద్దు చేయాలన్నారు. యూనిఫామ్‌, జీతాలతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు మోహన్‌, కృప, సూర్య, కోటి బాబు, తదితరులు పాల్గొన్నారు.
పాడేరు : ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు కాంటాక్ట్‌ విధానం రద్దు చేసి వైద్య విధాన పరిషత్‌ ద్వారా జీతాలు చెల్లించాలని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు . బోనంగి చిన్నయ్య పడాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డుల సమస్యలపై చింతపల్లి ఆసుపత్రి సూప రింటెండెంట్‌ డాక్టర్‌ ఆదిత్య కీర్తికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌ విధానం రద్దు చేసి వైద్య విధాన పరిషత్తు కింద జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి ఆసుపత్రులలో 20 సంవత్సరాల నుండి పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారని తెలిపారు.పిఎఫ్‌ ఈఎస్‌ఐ కార్మికుల నుండి వసూలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం చెల్లించడం లేదన్నారు. సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రతినెలా జీతాలు క్రమంగా చెల్లించి, పరికరాలు, యూనిఫామ్‌ పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది మంగ వేణి, ఎస్‌ .సుగుణమ్మ, ఎల్‌ ప్రియాంక, ఎస్‌ కే బేబీ తదితరులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో వైద్యాధికారిని మౌనికకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల ఉపాధ్యక్షులు పి.భీమరాజు మాట్లాడుతూ, చాలీ చాలని వేతనాలతో పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు 16 వేల వేతనం రాష్ట్ర ప్రభుత్వం అందచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.కాంట్రాక్ట్‌ విధానం రద్దు చేసి వైద్య విధాన పరిషత్‌ ద్వారా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పరిశుద్య కార్మికులు కాశీ, నారాయణ, సుబ్బలమ్మా, దేవీ, గాసి, రాజారావు, ధర్మంరావు పాల్గొన్నారు.