
ప్రజాశక్తి గాండ్లపెంట : పారిశుధ్య కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు చెత్తతో తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సాంబశివ, స్థానిక నాయకుడు రాజారెడ్డి, పారిశుధ్య కార్మికుల సంఘం నాయకులు అక్కులప్ప మాట్లాడుతూ దాదాపు సంవత్సరం నుంచి పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వేతనాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ కార్యదర్శి రఫీ పారిశుధ్య కార్మికులకు బెదిరిస్తున్నాడని ఆయన విధులుకే సక్రమంగా హాజరు కాలేదని అన్నారు. స్పందించిన తహశీల్దార్ హమీద్‌బాషా మాట్లాడుతూ ఇఒఆర్‌డితో చర్చించి బకాయి వేతనాలు త్వరలోనే చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు నరసింహులు, ఆంజనేయులు, మస్తానప్ప, గంగులప్ప, బాలకృష్ణ, కదిరప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.