ప్రజాశక్తి - అమరావతి : మండల కేంద్రమైన అమరావతిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న తమకు ఐదు నెలలుగా వేతనాలు రాలేదని, కుటుంబ పోషణ, ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా ఇచ్చే కొద్దిపాటి వేతనాలనూ సమయానికి జీతం ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నామని అంటున్నారు. రెక్కాడితే డొక్కడినే తమ కుటుంబాలు నెలలతరబడి వేతనాలు రాకపోవడంతో బతుకు బండి నడవడం కష్టంగా ఉందంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలో తాము 9 మందిమి పనిచేస్తున్నామని, జీతాలు అడుగుతుంటే ఎప్పటికప్పుడు అదిగో.. ఇదిగో.. అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. ఈ సమస్య జిల్లావ్యాప్తంగా ఉందని, ఉన్నతాధికారులు కలుగజేసుకుని సమస్యను తీర్చాలని కార్మికులు కోరుతున్నారు. ఇప్పటికే నిత్యాసరాల ధరలు పెరిగి కుటుంబ ఖర్చులు ఎక్కువయ్యాయని, నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో నిత్యం అప్పులు చేయాల్సి వస్తోందని, ఇప్పుడు అప్పులు కూడా పుట్టడం లేదని కార్మికులు చెబుతున్నారు.










